భాజపాతో జనసేనాని పవన్ కల్యాణ్ పొత్తు… అప్పట్లో, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో చిరంజీవి విలీనం… ఈ రెండూ వేర్వేరు సందర్భాలు. పొత్తు, విలీనం… ఈ రెండూ వేర్వేరు పరిణామాలు. అయితే, ఇప్పటి పొత్తు సమయంలో పవన్ కల్యాణ్ అనుసరించిన తీరు, అప్పటి విలీన సమయంలో చిరంజీవి అనుసరించిన తీరు దాదాపు ఒకేలా కనిపిస్తున్నాయి. పవన్, చిరంజీవి… ఈ రెండు సందర్భాల్లో ఈ ఇద్దరూ తమ ప్రాధాన్యతను తామే తగ్గించుకున్నారా అభిప్రాయం కలుగుతోంది.
భాజపా జాతీయ పార్టీయే కావొచ్చు, కానీ ఆంధ్రాలో జనసేనతో పోల్చుకుంటే తక్కువే. నాయకుడిగా, నటుడిగా పవన్ కి ఉన్న సమ్మోహన శక్తి ఏపీ భాజపాకి లేదు. ఈ లెక్కన అవసరం ఎవరిది..? కానీ, భాజపా వ్యవహార శైలి అలా లేదు. ఈ పొత్తులో పైచేయి మాది, జనసేన కంటే మేం పెద్ద పార్టీ అనే కలరింగ్ ఇచ్చే విధంగా పొత్తు కుదుర్చుకున్నారు. జాగ్రత్తగా గమనిస్తే… జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షాగానీ, ప్రధాని మోడీగానీ పవన్ తో కలిసి ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించలేదు, కనీసం పవన్ ని వాళ్లు కలవలేదు. జేపీ నడ్డా అయినా పవన్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాలి కదా? అదీ చెయ్యలేదు. ఆ మధ్య టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు భాజపాలో చేరిప్పుడు.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిసి నడ్డా సమక్షంలో చేరారు. చేరడం వేరు పొత్తు వేరు. కానీ, ఇక్కడ పవన్ స్థాయిని గుర్తించి గౌరవించాలి కదా? ఈ గుర్తింపు భాజపాకి లేదని కాదు. కానీ, ఇక్కడే… భాజపాతో పవన్ సరిగా బేరమాడలేకపోయారా అనే అనుమానం కలుగుతుంది. తన స్థాయికి తగ్గకుండా పొత్తు ప్రకటన జాతీయ నేతలతో ఢిల్లీలో ఎందుకు చేయించుకోలేకపోయారు అనే అనుమానం కలుగుతోంది.
అప్పట్లో, కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసే సమయంలో చిరంజీవికి కూడా ఇలానే తన స్థాయికి తగ్గ ప్రాధాన్యత దక్కించుకోలేకపోయారనే అనిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 18 శాతం ఓటింగ్ సాధించుకుని, 18 మంది ఎమ్మెల్యేలతో పార్టీని విలీనం చేస్తున్నప్పుడు… కనీసం కీలకమైన శాఖకు కేంద్ర మంత్రి పదవైనా దక్కించుకోవాల్సింది. కానీ, సహాయ మంత్రితోనే సంత్రుప్తి చెందేశారు. అత్యంత ప్రజాదరణ పొందిన మెగాస్టార్ కి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రాధాన్యత ఇంతేనా అనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కూడా భాజపాతో పొత్తు విషయంలో తనకు రావాల్సిన ప్రాధాన్యతను దక్కించుకోలేకపోయారనే చిన్న అసంత్రుప్తి సగటు అభిమానికి కలుగుతుంది. ‘ఆంధ్రాలో పవన్ తో భాజపా’ అన్నట్టుగా ప్రస్తుత కలయిక ప్రకటన ప్రొజెక్ట్ కాలేదు, ‘భాజపాతో పవన్’ అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతోందనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.