కర్ణాటకలో బిజెపి పూర్తి స్థాయి ని మెజారిటీని అందుకోలేక చతికిల పడిపోవడం, రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ విధిలేని పరిస్థితుల్లో, 3వ స్థానంలో ఉన్న జేడీయూ పార్టీ నేత కుమారస్వామిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి మద్దతు ఇవ్వడం తెలిసిందే. అయితే ఈ కర్ణాటక రాజకీయం చాలా మందిని ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. ఇటు ఆంధ్రలో పవన్ కళ్యాణ్ కుమారస్వామి తరహా ముఖ్యమంత్రి అయిపోవచ్చని భరోసాతో ఉంటే, తెలంగాణలో మాత్రం బిజెపి , ఎంఐఎం పార్టీల నేతలు కూడా అదృష్టం కలసి వస్తే ‘కుమార’ స్వామి తరహాలో తమకి కూడా ముఖ్యమంత్రి పదవి ‘సంభవిస్తుందని’ కలలు కంటున్నారు.
119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 60 ఎమ్మెల్యేల మ్యాజిక్ ఫిగర్ ఇటు టిఆర్ఎస్ గాని అటు ప్రజా కూటమి కానీ సాధించలేకపోయిన పక్షంలో, ఆ మ్యాజిక్ ఫిగర్ కి అవసరమైన 4 లేదా 5 సీట్లు తాము గెలుచుకో గలిగితే ఇది సాధ్యమేనని బలంగా నమ్ముతున్నాయి బిజెపి, ఎంఐఎం పార్టీలు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఇటీవల బహిరంగ సభలో మాట్లాడుతూ కుమారస్వామి తరహాలో కింగ్ మేకర్ అవుతామని బాహాటంగానే వ్యాఖ్యానించాడు. ఇక బీజేపీ కూడా, తాము లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు అని బీరాలు పలుకుతోంది. అయితే ఏ మాటకామాటే చెప్పాలి, బిజెపికి మూడు నుంచి ఐదు స్థానాలు వచ్చే అవకాశం గట్టిగానే కనిపిస్తోంది. అలాగే అన్ని సర్వేలు కూడా ఎంఐఎం 7 నుంచి 8 సీట్లు సాధించవచ్చని తేల్చి చెబుతున్నాయి. ఈ లెక్కన టిఆర్ఎస్ కానీ ప్రజా కూటమి కానీ మెజారిటీ సాధించలేకపోతే ఈ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ చక్రం తిప్పే అవకాశాలు కచ్చితంగా ఉంటాయి.
90వ దశకంలో ఈ సంకీర్ణ ప్రభుత్వాలు దేశాన్ని ఎంతగా తిరోగమన దిశలో నడిపించాయో, ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు కానీ ఆనాటి ఓటర్లకు ఇంకా బాగానే గుర్తుంది. పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణల పాలన తర్వాత వాజ్పేయి ప్రధాని కావడానికి ముందు ఆ మధ్య కాలంలోఎంతమంది ప్రధాన మంత్రులు దేశానికి మారారో చూస్తే అర్థమవుతుంది అప్పటి దేశ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండేదో అని. తర్వాత్తర్వాత అటువంటి అస్థిర ప్రభుత్వాల ని కాదని ప్రజలు సుస్థిరత వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. అయితే మళ్లీ కుమారస్వామి కారణంగా అనేక పార్టీల నేతలకు, రాష్ట్రం మొత్తం ప్రభావం చూపేంత బలం తమ పార్టీకి లేకపోయినప్పటికీ, తాము కూడ ముఖ్యమంత్రి అయిపోవాలనే కలలు మొదలయ్యాయి. ఇటువంటి అస్థిర ప్రభుత్వాలు రాష్ట్రాన్ని ఏ రకంగా తిరోగమన దిశలో నడిపిస్తాయో చెప్పడానికి చాలా ఉదాహరణలు దేశంలో ఉన్నాయి.
మరి ప్రజలు ఏదో ఒక వైపు స్పష్టంగా మొగ్గు చూపుతారా లేదంటే మరింత మంది కుమార స్వాములను తయారు చేస్తారా అన్నది మరో వారంలో తేలి పోతుంది.