” పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే.. జనసేన పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందనే… నిర్వహించలేదు. దమ్ముంటే పంచాయతీ ఎన్నికలు పెట్టాలి..” ఇది ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్.. తరచూ చెబుతున్న డైలాగ్. ఇది కొంచెం అతిశయోక్తితో కూడుకున్నదే అయినా… ఏపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు పెట్టలేదు కాబట్టి కాస్త సీరియస్‌గానే అనిపించింది. అయితే.. పవన్ కల్యాణ్ కోరిక మరో మూడు నెలల్లో తీరబోతున్నది. కోర్టులో ఉన్న రిజర్వేషన్ల అంశంపై… ఎప్పుడు క్లారిటీ వస్తే.. ఆ వెంటనే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలునిర్వహించేస్తుంది. అందులో అందులో ఎలాంటి సందేహం లేదు.
పంచాయతీ ఎన్నికలు పెడితే జనసేన పరిస్థితి ఏమిటి..?
పంచాయతీ ఎన్నితలు పెట్టాలని పవన్ కల్యాణ్ సవాల్ చేసిన విషయం ఆ పార్టీకే ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనసేన పార్టీని ప్రారంభించి ఐదేళ్లు అయి ఉండవచ్చు కానీ.. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీకి కనీసం క్యాడర్ లేదు. పట్టణాలు, నగరాల్లో… ఫ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించినా.. గ్రామాల్లో అసలు ఆ పార్టీకి ఉనికే లేదు. కొద్ది రోజుల కిందట.. జనసేన పార్టీ జెండా దిమ్మలు ఊరూరా ఉండాలని.. పవన్ కల్యాణ్ అభిమానులకు పిలుపునిచ్చారు. కానీ.. ఆ దిశగా.. కనీసం ఒక్క శాతం ఊళ్లో కూడా.. జెండా దిమ్మలు రూపుదిద్దుకోలేదు. ఈ పరిస్థితి చూస్తేనే.. జనసేన పరిస్థితి గ్రామాల్లో అత్యంత దయనీయంగా ఉందన్న విషయం వెల్లడవుతుంది. మరి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు మీద పడితే జనసేన తట్టుకోవడం కష్టమే..!
పార్టీ తరపున అభ్యర్థులు ఉంటారా..?
నిజానికి పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తుల మీద జరగవు. సానుభూతి పరుల ఆధారంగా.. ఆయా పార్టీల క్యాడర్లను నిలబెడతారు. వ్యవస్థ అంతా… ఆయాపార్టీల… ద్వితీయ శ్రేణి నాయకత్వం మీదనే నడుస్తుంది. పార్టీ అధ్యక్షుడు పట్టించుకోవాల్సినంత ఎన్నికలు కావు. టీడీపీ, వైసీపీలకు… జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వ్యవస్థ ఉంది కాబట్టి.. వాటితో ఎన్నికలను మేనేజ్ చేసుకోగలవు. కానీ.. అలాంటి వ్యవస్థ ఒక్క శాతం కూడా .. జనసేనకు లేదు. కాబట్టి… ఎన్నికలకు పార్టీ సానుభూతి పరులుగా ఉన్న వారిని అభ్యర్థులుగా నిలబెట్టడం అనేది కత్తి మీద సామే..!
తేడా వస్తే పార్టీపై ప్రభావం ఎలా ఉంటుంది..?
నిజానికి జనసేన పార్టీని ప్రారంభించిన తర్వాత ఒక్కసారి అంటే.. ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడలేదు. ఏపీ లో కానీ.. తెలంగాణలో కానీ ఈ నాలుగున్నరేళ్ల కాలంల చాలా ఉపఎన్నికలు వచ్చాయి.. గ్రేటర్ హైదరాబాద్ , కాకినాడ మున్సిపల్ ఎన్నికలొచ్చాయి. ఎక్కడా పోటీ చేయలేదు. నేరుగా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటాలనుకున్నారు జనసేన నేతలు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పంచాయతీ ఎన్నికలంటే.. అరవై నుంచి 70 పార్టీ బలం ఎంత అనేది తేలిపోతుంది. ఇక్కడ .. ప్రభావం చూపించకపోతే.. అసెంబ్లీ ఎన్నికల్లో పట్టించుకునేవారు కూడా ఉండరు. వ్యవస్థ లేదని ఎన్నికలకు దూరంగా ఉండలేని పరిస్థితి జనసేనది. ఎందుకంటే.. ఎన్నికలు పెట్టాలని పవన్ కల్యామ్ ఇప్పటికే చాలెంజ్ చేసి ఉన్నారు. పోటీ చేస్తే.. పార్టీ అస్థిత్వం పంచాయతీ ఎన్నికలతోనే ప్రమాదంలో పడుతుంది. ఓ రకంగా జనసేనకు పంచాయతీ ఎన్నికలు క్లిష్టమైన పరిస్థితినే తెచ్చి పెట్టాయని చెప్పుకోవాలి .