జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తారంధ్రలో పర్యటిస్తున్నారు. కానీ మీడియాలో ఆయనకు వస్తున్న కవరేజీ అంతంతమాత్రమే. కొంత కాలం కిందట.. ఆయన మీడియాతో జగడం పెట్టుకున్నారు. అంతకు ముందు.. పవన్ ఓ ట్వీట్ చేసినా న్యూస్ చానళ్లు బ్రేకింగ్ న్యూస్‌లతో హడావుడి చేసేవి. కానీ ఆ తర్వాత మాత్రం… పవన్‌కు వస్తున్న ప్రచారం.. మీడియా కవరేజీ పరిమితమయింది. దీంతో.. పవన్ కల్యాణ్ పోరాటం ప్రజల్లోకి వెళ్లడం లేదన్న భావన జనసేన వర్గాల్లో ఉంది. దీని కోసం సొంత చానల్ ఉండాలన్న ఆలోచన కూడా ప్రారంభమయింది.
నిజానికి .. మీడియాతో గొడవ పెట్టుకున్నప్పుడే.. పవన్ కల్యాణ్ కొత్త టీవీ చానల్ ప్రారంభించబోతున్నారని ప్రచారం జరిగింది. జే టీవీ పేరుతో కొన్ని లోగోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత 99టీవీ టేకోవర్ చేస్తారని ప్రచారం జరిగింది. పవన్‌కు చెందిన వ్యక్తులు .. డీల్ మాట్లాడినప్పటికీ.. సాంకేతిక కారణాలతో వర్కవుట్ కాలేదు. ఇక తులసీ సీడ్స్ యజమాని తులసీరామచంద్ర ప్రభు..టీవీ చానల్ ప్రారంభించాలని ఐదేళ్ల కింటే ప్రయత్నించారు. పీఆర్పీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఆ తర్వాత తులసీ టీవీ పేరుతో సన్నాహాలు చేశారు. జర్నలిస్టులకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. కానీ తెరమీదకు రాలేదు. ఇప్పటికీ.. ఈ చానల్‌కు లైసెన్స్ , బ్యాండ్ విడ్త్ ఉన్నాయి. తులసీ రామచంద్రప్రభు కుటుంబసభ్యులు ఇప్పుడు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. జనసేన పార్టీ ఈ చానల్‌ను లాంచ్ చేస్తుందన్న ప్రచారం కూడా ఉంది.
ఇక వారం రోజుల క్రితం.. కమ్యూనిస్టు పార్టీ చేతుల్లో ఉన్న.. టెన్ టీవీని పవన్ కొనుగోలు చేస్తారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న టెన్ టీవీలో కొంత పెట్టుబడి సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంది కాగా.. మిగతా అంతా క్రౌడ్ ఫండింగ్. జనసేన కోసం పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ టెన్‌టీవీలో పెట్టుబడులు పెడతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీని కోసం చర్చలు ప్రారంభించారట. చిరంజీవి కూడా పెట్టుబడుల చర్చల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి, అల్లు అరవింద్, నాగార్జున గతంలో మా టీవీలో పార్టనర్లుగా వ్యవహరించారు.
ప్రస్తుత రాజకీయాల్లో ప్రత్యేకంగా మీడియా సంస్థ లేకండా.. సరైన ప్రచారం పొందడం కష్టమే. ప్రతి రాజకీయ పార్టీకి.. ఓ మీడియా సంస్థ సపోర్ట్‌గా ఉంటోంది. ప్రతి మీడియా సంస్థకు ప్రత్యేకమైన ఎజెండా ఉంటోంది. ఒక్క ఏపీలోనే కాదు.. దక్షిణాదిలోనూ ఇదే పరిస్థితి. సోషల్ మీడియా ద్వారానో..మరో విధంగానో.. ఓటర్లను చేరుకోవడం అంత సులభం కాదు. కొన్ని వర్గాలను మాత్రమే చేరుకోగలుగుతారు. అదే టీవీ చానల్ అయితే సామాన్యుల ఇళ్లలోకి వెళ్లవచ్చు. మొత్తానికి పవన్.. ఆగస్టు 14వ తేదీన తన టీవీ చానల్‌ను లాంచ్ చేయవచ్చన్న ప్రచారం మాత్రం అంది. అది కొత్తదా.. ఇప్పటికే ఉన్నదా.. అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆగస్టు 14వ తేదీనే ఎందుకు అంటే.. ఆ రోజున మ్యానిఫెస్టో ప్రకటిస్తానని.. మార్చి పధ్నాలుగో తేదీన స్వయంగా ప్రకటించారు మరి. తన ఎజెండా ఏమిటో… తన సొంత చానల్లో వెల్లడించే అవకాశం ఉంది. దీనిపై మరో నెలలో క్లారిటీ వస్తుంది.