పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయబోతున్నాడన్న వార్త టాలీవుడ్ అంతా వ్యాపించేసింది. ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్ డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈసినిమాకి దర్శకుడు కూడా దాదాపుగా ఖరారైపోయాడని టాక్. ఆ అవకాశం డాలీకి ఇచ్చినట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌తో `గోపాల గోపాల`,`కాటమరాయుడు` చిత్రాలకు దర్శకత్వం వహించాడు డాలీ. ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాడు. అందుకే… డాలీకి పవన్ నుంచి పిలుపు వెళ్లిందని తెలుస్తోంది. ఓ దశలో బాబి పేరు కూడా పరిశీలించినట్టు టాక్. `సర్దార్ గబ్బర్‌సింగ్`కి బాబీ దర్శకుడు. ఆ ఫ్లాప్ తో బాబీ చాలా డీలా పడిపోయాడు. `జై లవకుశ`తో మళ్లీ ఊపిరి పీల్చుకున్నాడు. సర్దార్ ఫ్లాప్ అయినా.. బాబీ పనితీరుపై పవన్ సంతృప్తితోనే ఉన్నాడని, అందుకే బాబికి మరో అవకాశం ఇద్దామనుకున్నాడని టాక్. కాకపోతే.. వెంకీ, నాగచైతన్య మల్టీస్టారర్‌తో బాబి బిజీ అవ్వబోతున్నాడు. డాలీ అయితే… అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేసి ఇవ్వగలడన్న నమ్మకంతో.. డాలీ వైపు మొగ్గు చూపిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే… పవన్ సినిమా విషయంలో తెర వెనుక పనులన్నీ స్పీడు స్పీడుగా జరుగుతున్నట్టు కనిపిస్తోంది. మరి అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి.