ఒక సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, దానిపై ప్రభుత్వం తక్షణం స్పందించడం అనేది ఈరోజుల్లో చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. సమస్యను ఎత్తి చూపుతున్నవారు ఎవరనేది ఇక్కడ పరిగణనలో ఉంటుందనేది గమనార్హం! ఎందుకంటే, ఒకవేళ ప్రతిపక్షం ఓ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం సాధించిందే అనుకోండి. ఆ క్రెడిట్ తమదే అని ప్రతిపక్షం చెప్పుకుంటుంది. ఆ అవకాశం అధికారంలో ఉన్నవారు ఎందుకిస్తారు..? కానీ, ఆంధ్రాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు సర్కారు వెంటనే స్పందించేస్తుంది. వ్యవసాయ శాఖలో ఏవో, ఏయీవో పోస్టుల భర్తీ నిబంధనలు సడలిస్తూ ఇచ్చిన జీవో 64ను ప్రభుత్వం రద్దు చేసింది. ఇదే ఇష్యూపై ఇటీవలే విద్యార్థులతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. తాము చేసిన డిగ్రీలకు గుర్తింపు లేకుండా పోతోందంటూ వారంతా పవన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని పవన్ కోరారు. అంతే, వెంటనే ప్రభుత్వం స్పందించి.. జీవో 64ను రద్దు చేసింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పవన్ ధన్యవాదాలు తెలిపారు.
ఆ మధ్య ఉద్దానం కిడ్నీ బాధితుల అంశాన్ని సీఎం దృష్టికి పవన్ తీసుకెళ్లారు. అప్పుడు కూడా హుటాహుటిన చర్యలకు ఆదేశించారు. ఎవరైతేనేం… సమస్య పరిష్కారం అయిందా లేదా అన్నదే ముఖ్యం. కానీ, పవన్ కల్యాణ్ చెబితేనే చంద్రబాబు సర్కారు స్పందన చాలా స్పీడ్ గా ఉంటుంది. పవన్ కల్యాణ్ పై ప్రత్యేక అభిమానమో… లేదా, భవిష్యత్తు అవసరాలపై ముందుచూపుతో వ్యవహరించడమో.. కారణం ఏదైనా పవన్ చెబితే చంద్రబాబు చేస్తారనేది మరోసారి నిరూపితం అయింది. అయితే, పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి నివేదించాల్సిన సమస్యలు ఇంకా చాలానే ఉన్నాయి. ఈ తరహాలో వాటిని కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది కదా. ఉదాహరణకు… తుందుర్రు ఆక్వా రైతుల సమస్య. ఎప్పట్నుంచో ఆ ప్రాంత రైతులు మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారు. అక్కడి గ్రామాల్లో పోలీసుల పహారాను కూడా ఆ మధ్య చూశాం. నిజానికి, ఈ సమస్య కూడా పవన్ కల్యాన్ వరకూ వెళ్లింది. కానీ, ఆయన దాని గురించి ఆ తరువాత పెద్దగా పట్టించుకోలేదు.
అదే విషయాన్ని ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ లో అడిగితే… కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు లోబడే అక్కడ పనులు జరుగుతున్నాయనీ, ఈ దశలో మనం అక్కడకి వెళ్లి ఆందోళనకు దిగితే, ప్రాజెక్టు పనుల్ని అడ్డుకుంటున్నామనే కొత్త పంచాయితీ అవుతుందని పవన్ అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో కావొచ్చు, రాజధాని భూసేకరణ విషయంలో కావొచ్చు… ఇలాంటివి చాలానే ఉన్నాయి. పవన్ చెబితే సమస్యలకు పరిష్కారం జరిగిపోతుంది కాబట్టి… వీటిపై కూడా ఆయన సీఎంకు లేఖలు రాస్తే బాగుండు! అయితే, జాగ్రత్తగా గమనిస్తే అర్థమౌతున్నది ఏంటంటే… చంద్రబాబు చాలా సులువుగా పరిష్కరించదగ్గ సమస్యల్నే పవన్ ఆయన దృష్టికి నేరుగా తీసుకెళ్తున్నారని అనుకోవాలి!