సాధారణంగా హీరోలు అర్థం పర్థం లేని ప్రకటనలు, గిమ్మిక్కులతో తమ సినిమాలకు విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇవాళ సినిమాల సక్సెస్ అనేది మొత్తం తొలివారం కలెక్షన్ల మీద మాత్రమే ఆధారపడిన నేపథ్యంలో.. వీలైనంతగా తమ సినిమా గురించి ప్రేక్షకలోకం యావత్తూ వెర్రెత్తి ఎదురుచూసేలా.. ఏదో కొన్ని గిమ్మిక్కులను ప్రదర్శించడం, ఓపెనింగ్స్ ఘనంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ఒక మార్కెటింగ్ టెక్నిక్ అయిపోయింది. అయితే సాధారణ హీరోల కంటె పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తీరే వేరు! ఆయన తను వెరైటీ అనే సంగతిని ఆడియో ఫంక్షన్ నుంచే ప్రారంభించారు. తన సినిమా సంగతి తర్వాత.. ఆడియో వేడుకకే హైప్ సృష్టించేశారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ టెలివిజన్ ప్రసారాలను ఎంత భారీ రికార్డు మొత్తానికి విక్రయించారో మనకు తెలియదు గానీ.. జనం మొత్తం.. ఈ వేడుకలో ఏదో జరిగిపోతుందని ఆబగా, ఆందోళనగా టీవీ చానల్‌కు అతుక్కుపోయి చూసేలా.. పవన్‌కల్యాణ్ భారీగా హైప్ క్రియేట్ చేసేశారు.
‘నా సినిమా ఆడియో ఫంక్షన్‌లోకి అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశం పుష్కలంగా ఉంది. పోలీసులు చాలా భద్రత ఏర్పాట్లు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి పాస్‌లు లేని ఎవ్వరూ కూడా ఆడియో ఫంక్షన్‌కు రావొద్దు అంటూ.. వేడుకకు ఒక రోజు ముందే… ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి చెప్పడం ద్వారా.. పవన్.. తన ఆడియో వేడుకకు భారీగా హైప్ ఇచ్చేసినట్లు అర్థమవుతోంది.
పైగా పవన్ కల్యాణ్ అభిమానులకు చాలా క్లారిటీగా మీరు టీవీ ఛానళ్లలో మాత్రమే చూడండి. పాస్‌లు లేకుండా వేడుకకు మాత్రం రావొద్దు అని ప్రెస్మీట్లో పదేపదే చెప్పారు. ఇప్పుడు పవన్ అభిమానులందరికీ కొత్త టెన్షన్ ప్రారంభమైనట్లే అనుకోవాలి. ‘అన్నయ్య ఆడియో వేడుకను చెడగొట్టడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారు… అన్నయ్య మీద కుట్ర జరుగుతోంది.. పవన్‌కు వ్యతిరేకంగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి… ఇంటెలిజెన్స్‌నుంచి పక్కా సమాచారం ఉండే ఉంటుంది… లేకపోతే అన్నయ్య ఇలా మాట్లాడుతాడా..’ అంటూ వారంతా ఈ ఫంక్షన్ గురించి ఆందోళనగా ఎదురుచూసే పరిస్థితిని పవన్‌కల్యాణ్ సృష్టించేశారు. సినిమా సంగతి ఏమో గానీ.. మొత్తానికి ఆడియో ఫంక్షన్‌కు మాత్రం మాంఛి హైప్ క్రియేట్ అయింది. ఆ మేరకు పవన్ సక్సెస్ సాధించినట్లే లెక్క!!