జనసేన పార్టీ పెట్టి మూడేళ్లు కావొస్తోంది. గడచిన సార్వత్రిక ఎన్నికల సమయంలోనే పార్టీని పెడుతున్నట్టు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. 2014 ఎన్నికల్లో నామ్ కే వాస్తే అన్నట్టుగానే పార్టీ ఉంది. టీడీపీ, భాజపా కూటమికి పవన్ మద్దతు ఇచ్చి, ప్రచారం చేశారు. ఆ తరువాతి నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటూ పవన్ బయలుదేరారు. ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడికి వెళ్లడం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా, ఉద్దానం కిడ్నీ బాధితులు, అగ్రిగోల్డ్ బాధితులు, రాజధాని రైతుల సమస్యలు, తుందున్న ఆక్వా రైతులు, వ్యవసాయ విద్యార్థులు.. ఇలా చెప్పుకోదగ్గ పోరాటాంశాలపైనే స్పందించారు! అయితే, మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవ్వరితో పొత్తు పెట్టుకోకుండా సొంతంగానే పోటీ చేస్తానని పవన్ ప్రకటించారు. గడచిన మూడేళ్లలో సొంతగా పోటీ చేసి సత్తా చాటుకునే స్థాయికి జనసేన చేరిందా.. అంటే, ఇంకా లేదనే మాటే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పాత్ర ఎలా ఉంటుందనే చర్చ మరోసారి తెరమీదికి వచ్చింది.
అన్ని స్థానాల్లోనూ సొంతంగా పోటీ చేస్తామని పవన్ చెప్పినా, ఈ మధ్యనే తన సోషల్ మీడియా టీమ్ శతఘ్నితో మాట్లాడుతూ.. 2018 డిసెంబర్ వరకూ పోటీకి సంబంధించి ఏమీ చెప్పలేనని స్పష్టత ఇచ్చారు. పార్టీ నిర్మాణం ఇప్పుడే మొదలైంది కాబట్టి, వచ్చే డిసెంబర్ లో పరిస్థితులు అంచనా వేసుకుని, అప్పటి బలాబలాలు చూసుకున్నాక ఎంతమందిని పోటీకి దింపాలనేది ప్రకటిస్తామన్నారు. అంటే, 175 స్థానాల్లో జనసేన పోటీకి దిగుతుందనేది అనుమానంగానే ఉంది. ఇక, పొత్తు విషయానికొస్తే… ప్రస్తుతానికి తెలుగుదేశంతోపాటు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోబోమనే సంకేతాలు పవన్ ఇస్తున్నారు. కానీ, సందర్భానుసారంగా చంద్రబాబు సర్కారును వెనకేసుకొస్తున్న ధోరణి పవన్ లో కనిపిస్తుంది. ఆ మధ్య కాపుల ఉద్యమం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే కరెక్ట్ అంటూ మెచ్చుకున్నారు. నంద్యాల ఉప ఎన్నిక విషయంలో తటస్థంగా ఉంటామని ప్రకటించడం ద్వారా పరోక్షంగా తెలుగుదేశం పార్టీకే మేలు జరిగింది. వచ్చే ఎన్నికల నాటికి మరోసారి టీడీపీకి మద్దతు ఇవ్వాల్సిన అనివార్యత పవన్ చుట్టూ వస్తుందేమో అనేది విశ్లేషకుల అంచనా.
ఇక, ఇతర పార్టీలతో కలిసి పనిచేసే అవకాశాల విషయానికొస్తే… తన లక్ష్యం అధికారం కాదు కాబట్టి, ప్రజల తరఫున పోరాటాలు మాత్రమే చేస్తా అంటున్నారు కాబట్టి, సంప్రదాయ రాజకీయ పార్టీలతో పవన్ పొత్తు ఉండకపోవచ్చనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏపీలో ప్రతిపక్షం వైకాపా జోలికి పవన్ వెళ్లడం లేదు. ఆ పార్టీ కూడా పవన్ వైపు చూడటం లేదు. స్వభావరీత్యా రెంటికీ పొసగదనే చెప్పొచ్చు. ఇక, మిగిలినవి వామపక్షాలు. ఆ భావజాలం పవన్ లో కనిపిస్తుంది కాబట్టి, వారితో కలిసి పనిచేస్తే మూడో ఫ్రంట్ కు ఆస్కారం ఉంటుంది. కానీ, ఆ ప్రయత్నం ఇంతవరకూ మొదలే కాలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే.. గడచిన మూడేళ్లుగా జనసేనగా సొంతంగా ఎదిగింది ఏమీ లేదనే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ విషయంలో కూడా ఇంకా గందరగోళమే ఉంది. అధికారం తన లక్ష్యం కానంత మాత్రాన రాజకీయంగా మరీ అంత నిరాసక్తంగా ఉంటున్నట్టు కనిపించకూడదు కదా! జనసేనకు చెందిన కొంతమంది ప్రతినిధులైనా చట్టసభలో ఉంటే, ప్రజల తరఫున తమ వాణిని మరింత బలంగా వినిపించే అవకాశం ఉంటుంది కదా. ఈ విషయంలో పవన్ చురుగ్గా ఆలోచించకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా గత ఎన్నికల సీనే పునరావృతం కావొచ్చనే భావన ఆ పార్టీ వర్గాల్లో ఉంది. పార్టీకి మూడేళ్లు నిండుతున్న ఈ తరుణంలోనైనా పవన్ ఆత్మవిమర్శ చేసుకునే అవకాశం ఉందంటారా..?