జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి తమకే మద్దతు ఇస్తారని వైకాపా మాజీ ఎంపీ అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. వైకాపా అధినేత ముఖ్యమంత్రి కావడం కోసం వచ్చే ఎన్నికల్లో మద్దతుగా ఉంటానని పవన్ చెప్పినట్టు వరప్రసాద్ చెప్పడం.. సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ.. ఈ ఇద్దరూ కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా..? ఒకే వేదికపైకి రాగలిగే కామన్ పాయింట్స్ ఉన్నాయా..? వైకాపా నేతలు ఆశిస్తున్నట్టు పవన్ మద్దతు ఇవ్వగలరా..? ఆ మాట పవన్ నేరుగా ఎందుకు ప్రకటించడం లేదు..? ఇలాంటి చాలా అంశాలపై ఇప్పుడు చర్చ మొదలైంది.
పవన్ కల్యాణ్, జగన్మోహన్ రెడ్డి.. స్వభావరీత్యా రెండు భిన్నధృవాలు. పవన్ కల్యాణ్ లో కొంత వామపక్ష భావజాలం, కొంత సామాన్యుడి కోణం, ప్రజా సమస్యల కోణం నుంచి స్పందిస్తుంటారు. జగన్ విషయానికి వచ్చేసరికి… కేవలం సొంత అజెండా మాత్రమే అన్నట్టుగా ఉంటారు. ఆయన ముఖ్యమంత్రి కావాలి.. అంతే, సమస్యలన్నీ అవే తీరిపోతాయన్నట్టుగా జగన్ తీరు ఉంటుంది. అయితే, ఇద్దరి మధ్యా కామన్ పాయింట్.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు చేయడం మాత్రమే! ఇద్దరూ కామన్ గా టీడీపీని విమర్శిస్తున్నారు. ఈ ఒక్క అంశంలో మాత్రమే వైకాపా, జనసేనల మధ్య కొంత సారూప్యత కనిపిస్తోంది.
ఎన్నికలూ పొత్తు వరకూ వచ్చేసరికి.. జగన్ కు పవన్ మద్దతు ఇచ్చే అవకాశం తక్కువే. ఎందుకంటే, ఎలాంటి ఆధారాలూ లేకుండా టీడీపీ అవినీతిపై విమర్శలు చేస్తున్నారు కదా, పక్కా ఆధారాలతో అవినీతికి పాల్పడ్డారంటూ కేసుల్లో ఇరుక్కున్న జగన్ కి మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడతారా..? చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కాకూడదనేది పవన్ కల్యాణ్ ప్రస్తుత లక్ష్యం అనుకున్నా… ప్రత్యామ్నాయంగా జగన్ ను చూస్తున్నారని చెప్పలేం! ఎందుకంటే, 175 స్థానాల్లో జనసేన కూడా పోటీకి దిగుతోంది. మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, కొత్త రాజకీయాలు చేస్తామంటూ పవన్ కూడా తనకు తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరోక్షంగా ప్రకటించుకున్నారు.
2014 ఎన్నికల్లో అనుభవం గల నాయకుడు అవసరం కాబట్టి చంద్రబాబుకు మద్దతు ఇచ్చారనీ, అయితే అవినీతి పెరిగిపోయింది కాబట్టి ఈసారి జగన్ కు మద్దతు ఇస్తారని వరప్రసాద్ అన్నారు కదా! ఈ వ్యాఖ్యలోనే గందరగోళం ఉంది. 2014 ఎన్నికల్లో పవన్ పోటీ చెయ్యలేదు కాబట్టి చంద్రబాబు మద్దతు ఇచ్చారు. 2019లో పోటీ చేస్తున్నారు. పైగా, గత ఎన్నికల్లో పోటీ చేయనందుకు చింతిస్తున్నా అంటూ పవన్ ఈ మధ్యనే బాధపడుతూప్రకటనలు చేశారు. ఇంకోటి.. అవినీతి పెరిగిపోయింది కాబట్టి జగన్ కు మద్దతు ఇస్తారనే అంచనా కార్యరూపం దాల్చే ఆలోచనగా కనిపించడం లేదు. టీడీపీలో అవినీతి పెరిగిందని, అవినీతి కేసుల్లో ఇరుక్కున్న జగన్ కు పవన్ మద్దతు ఇస్తే… విమర్శలు తప్పవు కదా. పవన్ చేస్తామంటున్న కొత్త రాజకీయలకు ఆస్కారం ఎక్కడుంటుంది..?
అన్నిటికన్నా ముఖ్యమైంది.. పవన్ కల్యాణ్ ప్రకటనల్లో కొంత గాలివాటం ఉండటం. టీడీపీ అవినీతీ అవినీతీ అంటున్నారే తప్ప, ఆధారాలతో పవన్ మాట్లాడటం లేదు. అందరూ అనుకుంటున్నారని అంటున్నా అనేసిన సందర్భాలూ ఉన్నాయి. గమనించాల్సిన మరో పరిణామం.. ఓపక్క పవన్ మద్దతుపై వైకాపాలో చర్చ జరుగుతుంటే.. మరోపక్క నిన్ననే చంద్రబాబుతో పవన్ కలుసుకోవడం. ఇద్దరూ పలకరింపులకు మాత్రమే పరిమితమయ్యారని అంటున్నా… కాసేపు ఆంతరంగికంగా కాసేపు చర్చించుకున్నారనే సమాచారమూ ఉంది.