ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 41వేల కోట్ల ప్రజాధనం గోల్ మాల్ చేసిందన్న ఆరోపణలు విస్తృతంగా వస్తున్నాయి. సాక్షాత్తూ అకౌంటెంట్ జనరల్ లేఖ రాయడం.. పీఏసీ చైర్మన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. అయితే దీనిపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వివరణ ఇచ్చారు… ఆ వివరణలో పీడీ అకౌంట్ల ప్రస్తావన ఉంది. నిధుల్ని పీడీ అకౌంట్లకు మళ్లించారని.. ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి.. వాడని నిధులు మురిగిపోయాయని అంతే తప్ప.. ఎవరికీ మళ్లించలేదని చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీ హయాలో జరిగిన పీడీ అకౌంట్ల రచ్చ మరోసారి ప్రజల మనసుల్లోకి వచ్చింది.
భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ” పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్”లో భారీగా నిధులున్నాయని.. అంటే పెద్ద స్కామ్ జరిగిపోయినట్లేనని అప్పట్లో ఆరోపణలు చేశారు. దీనిపై టీవీ చానళ్లలో డిబేట్లు పెట్టారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. టీడీపీ నేతల పర్సనల్ ఖాతాలు అన్నట్లుగా జీవీఎల్ చెప్పడం… వైసీపీ మీడియా దాన్ని అదే పద్దతిలో ప్రచారం చేయడం జోరుగా సాగిపోయాయి. ఏదో అవినీతి జరిగిందే విషయాల్లో అర్థం కాని సాంకేతిక పదాలతో ప్రజల్లోకి తీసుకెళ్తే.. చాలు.. టూజీ స్కాంలా ఏమీ లేకపోయినా.. ప్రభుత్వంపై మచ్చ పడిపోతుందని.. అప్పట్లో వ్యూహం పన్నారు. దానికి తగ్గట్లుగానే ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు… అదే రూ. 41వేల కోట్ల గోల్ మాల్ తిరిగి వచ్చింది. పీడీ అకౌంట్లలో పెట్టామని అవి మురిగిపోయాయని చెబుతున్నారు.
విశేషం ఏమిటంటే.. అప్పట్లో పీడీ అకౌంట్లలో ఉన్న నిధుల గురించి చర్చ పెట్టింది బీజేపీనే. ఇప్పుడు… అలాంటి అకౌంట్లలో పెట్టి మురిగిపోయాయని చెబుతున్న ఏపీ సర్కార్ వాదనను ఖండించడానికో.. విమర్శలు చేయడానికో బీజేపీ నేతలు తెర ముందుకు రావడం లేదు. అసలు ఈ అంశంలో ఒక్క మాటంటే.. ఒక్క మాట బీజేపీ నేతల నుంచి రాలేదు. ప్రభుత్వానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని వారు సైలెంట్‌గా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో టీడీపీ హయాంలో ఏ రచ్చ అయితే చేశారో అవన్నీ ఇప్పుడు వైసీపీకి వరుసుగా రివర్స్ అవుతూండటం.. వైసీపీ నేతల్ని కూడా కంగారు పెడుతోంది.