వైసీపీలో కొనసాగడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉక్కపోతగా భావిస్తున్నారా..? భూకబ్జాలు, మదనపల్లి ఫైర్ యాక్సిడెంట్ కేసులో తనకు ఇబ్బందులు తప్పవని అంచనాకు వచ్చేశారా..? ఈమేరకు రక్షణ కోసం బీజేపీలో చేరక తప్పనిసరి పరిస్థితి నెలకొందని అనుకుంటున్నారా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ మినహా పదిమంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు చెందిన ఓ పెద్ద మనిషి తనతో ఈ మాట అన్నారని ఆదినారాయణ రెడ్డి చెప్పడంతో ఎవరా..? పెద్ద మనిషి అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. అయితే, వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతామని అంటే తాను తిరస్కరించినట్లు చెప్పారు. ఆదినారాయణ రెడ్డి చెప్పిన ప్రకారం చూస్తే..పెద్దిరెడ్డి కూడా బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టుగానే అర్థం అవుతోంది.
Also Read : పెద్దిరెడ్డి అష్టదిగ్బందం… ఈసారి వదలేలా లేరుగా!
ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి బీజేపీ లో చేరుతున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. దీనిని అప్పట్లోనే ఆయన కొట్టిపారేసినా…ఇప్పుడు పరిస్థితులు మారాయి. పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. మదనపల్లి ఫైర్ యాక్సిడెంట్ కేసులో ఆయన ప్రధాన అనుచరుడు మాధవ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదంతా ఎవరి ఆదేశాల మేరకు చేశారు అన్నది త్వరలోనే తేలనుంది. దీంతో ఆయనకు ఇబ్బందులు తప్పవని విశ్లేషణలు వెలువడుతున్న వేళ ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.