ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నామని.. అలా చేసే మంత్రి నారాయణను పట్టుకోగలిగామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఆయన ప్రకటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రకరకాల చర్చలకు కారణం అవుతోంది. ఓ మంత్రే తాము ఫోన్లను ట్యాప్ చేస్తున్నామని ప్రకటించడంతో.. ప్రభుత్వం ఇంకా ఎంత మంది ఫోన్లను ట్యాప్ చేస్తోందన్న చర్చ.. అనుమానం రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది. ఎలా ట్యాప్ చేస్తున్నారు..? ఏ సాప్ట్ వేర్‌తో ట్యాప్ చేస్తున్నారు ? వంటి అనుమానాలు ప్రారంభమయ్యాయి.
గతంలో పెగాసస్ అంశంపై దుమారం రేగినప్పుడు ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్ తాము కూడా స్పైవేర్ వాడుతున్నామని కానీ రాజకీయ అవసరాల కోసం కాదని ప్రకటించారు. తర్వాత స్పైవేర్ వేరు.. నిఘా సాఫ్ట్ వేర్ వేరని కవర్ చేసుకున్నారు. గత ప్రభుత్వంలో పెగాసస్ వాడారని ఈ ప్రభుత్వం రచ్చ చేసింది. ఇందు కోసం హౌస్ కమిటీని నియమించారు. కానీ ఇప్పటి వరకూ సభా కమిటీ ఒక్క సారి కూడా సమావేశం కాలేదు. అప్పట్లో జరిగిందో లేదో కానీ.. ఇప్పుడు మాత్రం అదే పనిగా వైసీపీ నేతలు ఫోన్లను ట్యాప్ చేస్తున్నామని చెబుతున్నారు.
దీంతో ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఈ అంశంపై మంత్రి పెద్దిరెడ్డి తాము ఫోన్లను ట్యాప్ చేస్తున్నామని చెబుతున్న వీడియోతో నెటిజన్లు పలు రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏ సాఫ్ట్ వేర్‌తో ట్యాప్ చేస్తున్నారో చెప్పాలని అంటున్నారు. ట్యాపింగ్ అనేది పెద్ద నేరంగా పరిగణిస్తారు. అయితే ఈ ప్రభుత్వంలో అలాంటివేమీ ఉండటం లేదు. పట్టించుకోవడం లేదు.