జగన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ పెద్ద బండేశారు. విజయవాడ వచ్చి నేరుగా జగన్ రెడ్డి ఇంటికి కాకుండా తాడేపల్లిలోని చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఈ పరిణామం ఒక్క సారిగా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్తో కలిసి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ప్రశాంత్ కిషోర్. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే వాహనంలో చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఐ ప్యాక్ ఇప్పటికీ వైసీపీకి పని చేస్తుంది. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ టీడీపీతో టచ్ లోకి వెళ్లడం వైసీపీ వర్గాలను షాక్కు గురి చేస్తోంది.
ఏ పార్టీ గెలుస్తుందో అంచనా వేసుకుని ఆ పార్టీకి స్ట్రాటజిస్టుగా పని చేయడానికి ప్రశాంత్ కిషోర్ ఆసక్తి కనబరుస్తూంటారు అయితే ఆయన చివరి సారిగా బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీ కోసం పని చేశారు. ఆ తర్వాత ఆయన స్ట్రాటజిస్టుగా పని చేయలేదు. కేసీఆర్ కోసం కొన్నాళ్లు పని చేశారు కానీ.. తర్వాత కేసీఆర్ వద్దనుకున్నారని చెబుతున్నారు.
టీడీపీకి పని చేయడానికి ప్రశాంత్ కిషోర్ ఆసక్తి కనబరుస్తున్నారని గతంలో జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఐ ప్యాక్ తో.. జగన్ రెడ్డి దూరం పెరుగుతున్న సందర్భంలో ఇలాంటి వార్తలు వచ్చాయి. అయితే దీన్ని ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు నేరుగా టీడీపీ హైకమాండ్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం.. సంచలనంగా మారింది. ఇది వైసీపీ క్యాంపును దిగ్భ్రాంతికి గురి చేస్తోందని చెప్పవచ్చు.