ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఉన్నంత ప్రాధాన్యత ప్రతిపక్షానికి ఉంది. ప్రతిపక్షం ఎప్పటికప్పుడు… తప్పుల్ని బయటపెడుతుందని.. ప్రజల్ని చులకన అవుతామన్న ఉద్దేశంతో.. అధికార పార్టీ… తప్పులు చేయడానికి భయపడుతుంది. కానీ తెలంగాణలో అలాంటి ప్రతిపక్షమే లేకుండా చేయాడనికి కేసీఆర్ సిద్ధమయ్యారు. తెలంగాణలో తన మాటే వేదవాక్కుగా ఉండాలని.. ఒక్క టీఆర్ఎస్ మాత్రమే .. తెలంగాణలో ఉండాలని డిసైడయ్యారు. కాంగ్రెస్నూ నిర్వీర్యం చేస్తున్నారు.
సీఎల్పీల విలీనాలతో పార్టీలు అంతమవుతాయా..?
కార్పొరేట్ సంస్థల విలీనాలే ఎక్కువగా హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. తెలంగాణ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాల కారణంగా …శాసనసభాపక్ష విలీనాలు హైలెట్ అవుతున్నాయి. గతంలో టీడీపీ శాసనసభాపక్షాన్ని.. ఇప్పుడు కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని .. టీఆర్ఎస్ లో విలీనం చేసేసుకున్నారు. నిజానికి రాజ్యాంగంలో కానీ.. మరెక్కడైనా కానీ.. పార్టీల విలీనం గురించి ఉంది… కానీ… లెజిస్లేచర్ పార్టీల విలీనం గురించి లేదు. కానీ… తెలంగాణలో మాత్రం కేసీఆర్ దీన్ని చేసి చూపిస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్, మండలి ఛైర్మన్ల పేరుతో.. ఈ రాజకీయ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ తర్వాత వారిలో 12 మంది విడతల వారీగా టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఆ పన్నెండు మంది కలిసి.. స్పీకర్ కు ఓ లేఖ సమర్పించారు. ఆ లేఖ సారాంశం… టీడీఎల్పీని.. టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడం. దానికి స్పీకర్ ఆమోద ముద్రవేశారు. టీడీపీ సభ్యులు ముగ్గురు అధికారికంగా సభలో ఉన్నప్పటికీ.. ఉనికి లేకుండా పోయింది. మరి వారెవరూ.. అన్న ప్రశ్న రాకుండానే.. మ్యానేజ్ చేసేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వంతు. ఓ వైపు గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయక ముందే ఈ విలీనాన్ని పూర్తి చేశారు
ప్రతిపక్షం లేకపోతే ప్రజలకు మేలు జరుగుతుందా..?
చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా చేస్తే.. రాజకీయ పార్టీలు అంతమవడం అనేది ఉండదని.. ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. చట్టసభల్లో అధికార పార్టీలదే ఇష్టా రాజ్యం అన్నట్లు గా చేసుకోవడానికి ఇలాంటి విలీనాలు, వలసలను ప్రొత్సహించడం ద్వారా ప్రజలకు కీడు జరుగుతుంది. అధికార పార్టీని ప్రశ్నించేవారే ఉండరని.. అలాంటి సమయంలో.. అధికార పార్టీ ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్న ఇద్దరు ఎమ్మెల్సీలు మార్చిలో పదవి విరమణ చేస్తారు. మార్చి తర్వాత మండలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఉండదు. శాసనసభలో ఉంటుంది. కానీ గెలిచిన 19 మందిలో ఎంత మంది కాంగ్రెస్లో ఉంటారో తెలియదు. అంటే ప్రతిపక్షంగా గుర్తించగలిగే స్థాయిలో ఉండకపోవచ్చు.
ప్రజలే ప్రతిపక్షంగా మారే పరిస్థితి తెచ్చుకుంటున్నారా..?
కాంగ్రెస్ పార్టీకి చట్టసభ సభ్యులు ఉండకపోవచ్చు. ఆ పార్టీకి మాట్లాడే సమయం కూడా దొరకకపోవచ్చు. అంత మాత్రాన.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉనికి కోల్పోయిననట్లు అనుకోవడం అమాయకత్వమే. టీఆర్ఎస్ కు 47 శాతం ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 53 శాతం ఓట్లు ఉన్నాయి. ప్రత్యామ్నాయం కావాలని ప్రజలు అనుకుంటే.. తాము కోరుకున్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఉందా లేదా అని చూడరు. గత చరిత్రలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. అయినా రాజకీయ దురుద్దేశంతో.. గేమ్ ఆడుతున్నారు. ప్రజలే ప్రతిపక్షంగా పోరాడాల్సిన పరిస్థితిని రాజకీయ పార్టీలు తెస్తున్నాయి.
———- సుభాష్