హైదరాబాద్ లోని ప్రభుత్వ భూముల్ని, స్థలాల్ని , రోడ్లను , చెరువుల్ని కబ్జా చేయడంతోనే.. నగరంలో చిన్న వర్షం పడినా ఆగమాగం అవుతుందని.. అలాంటి వారిని ఉపేక్షించబోమని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కేసీఆర్ అలా గట్టిగా చెప్పేసరికి సీన్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని కబ్జాదారులు హడలిపోయారు. అధికారులు రంగంలోకి దిగితే కోట్లాది రూపాయలతో నిర్మించుకున్న భవనాలు నేలమట్టం అవుతాయని తెగ టెన్షన్ పడిపోయారు.
కానీ, కేసీఆర్ వార్నింగ్ ప్రకటనలకే పరిమితమైంది. నగరంలో చెరువులను, పార్క్ లను చెరబట్టిన కబ్జాదారులపై కొరడా ఝులిపించిందిలేదు. కనీసం నోటీసులు ఇచ్చింది లేదు. దీంతో పదేళ్లలో హైదరాబాద్ లో కబ్జాదారుల కన్ను పడిన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి తన యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తున్నారు. హైడ్రా అనే వ్యవస్థను తీసుకొచ్చి అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు.
నిబంధనలను అతిక్రమించి ప్రహరీగోడలు, భవనాలు నిర్మిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని ఇప్పటికే హైడ్రాకు ఆదేశాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి..ఇందులో మన, తన అనే తారతమ్యం లేకుండా దూకుడుగా ముందుకు సాగాలని ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో హైడ్రా పేరు వింటేనే అక్రమార్కులు హడలిపోతున్నారు.
మరోవైపు హైడ్రా దూకుడుతో నగరప్రజలు ఖుషీ అవుతున్నారు. అక్రమ నిర్మాణాలతో పలు ప్రాంతాలు జలదిగ్బంధం అవ్వడమే కాకుండా, ట్రాఫిక్ రద్దీ పెరిగిందని, రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతో వీటన్నింటి నుంచి విముక్తి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడం కేసీఆర్ కు సాధ్యం కాలేదని, రేవంత్ మాత్రం చెప్పింది చేసి చూపిస్తున్నారని అంటున్నారు.