ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోనుందా..? ట్యాపింగ్ కేసు సూత్రధారి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కొద్ది రోజుల్లోనే ఇండియాకు రానున్నారా..? అంటే అవుననే అంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు.
ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక సూత్రధారిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ అమెరికా నుంచి ఇండియాకు వస్తేనే కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని సిట్ భావిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావులను విచారించిన సిట్… ప్రభాకర్ రావును విచారిస్తే ఈ కేసు కీలక దశకు చేరుకుంటుందని నిర్ణయానికి వచ్చింది. అయితే, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావును అరెస్ట్ చేయగానే తనను అరెస్ట్ చేస్తారనే భయంతో ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్ళారు. ఆయనను ఇండియాకు తీసుకొచ్చేందుకు బంధువులు, అధికారుల ద్వారా సిట్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే, ప్రభాకర్ రావు వీసా గడువు ముగియనుందని దాంతో ఈ నెలాఖరున ఆయన ఇండియాకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అయితే, ప్రభాకర్ రావు అనారోగ్యాన్ని కారణంగా చూపిస్తూ వీసా గడువును పెంచుకునేందుకు ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే ప్రభాకర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇండియాకు తీసుకొచ్చేందుకు సిట్ అధికారులు ఏం చేస్తారు..? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ కేసులో పలువురు బీఆర్ఎస్ నేతలూ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వారికీ సిట్ నోటీసులు ఇస్తుందని ప్రచారం జరిగినా.. ప్రభాకర్ రావు విచారణ పూర్తి అయిన తర్వాతనే బీఆర్ఎస్ లీడర్లకు నోటీసులు ఇవ్వాలని సిట్ భావిస్తోంది. కానీ , ప్రభాకర్ రావు మాత్రం ఇండియాకు వస్తే తనను అరెస్ట్ చేయడం పక్కా అని ఆందోళనతో విదేశాల్లోనే ఉండేందుకు తనకు ఉన్న మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నారు.