ఎంత హైప్ చేసినా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించడానికి చాలా మంది సిద్ధపడటం లేదు. ప్రారంభమైన ఊపులో పార్టీలో వచ్చి చేరిన ఒకరిద్దరు కూడా తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల పార్టీ నేతలు హైప్ కోసం ప్రశాంత్ కిషోర్‌ను వాడేసుకోవడం ప్రారంభించారు. షర్మిల పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ పని చేయబోతున్నారని.. పీకేతో షర్మిల ఒకటో తేదీన సమావేశం కాబోతున్నారంటూ మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే షర్మిల తో పీకే భేటీ అయినా అవకపోయినా.. ఆయన మాత్రంతాను ఇక వ్యూహకర్తగా పని చేయడం లేదని గతంలోనే ప్రకటించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయన తెలంగాణకు వచ్చి షర్మిల పార్టీ కోసం పని చేసే పరిస్థితి లేదు. అయితే ఆయన కంపెనీ ఐ ప్యాక్ మాత్రం తన విధులు తాను నిర్వహిస్తుంది. ఆ కంపెనీ సేవలు ఎవరైనా పొందవచ్చు. ఇప్పుడు ఐ ప్యాక్ టీంను భారీ మొత్తం వెచ్చించి హైర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో షర్మిల ఉన్నట్లుగా చెబుతున్నారు. అలా ఇప్పటికే ప్రాథమిక చర్చలు చేసుకున్నారని అంటున్నారు.
ఐ ప్యాక్ తో చేసుకునే ఒప్పందానికి పీకేతో ముడిపెట్టి.. పీకే పని చేస్తారని ప్రకటించుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి షర్మిల ఇప్పటికే గతంలో పీకే టీంలో పని చేసిన తమిళనాడుకు చెందిన ప్రియ అనే యువతిని స్ట్రాటజిస్ట్‌గా పెట్టుకున్నారు. కానీ ఆమెతో అంత క్రేజ్ రాలేదనుకున్నారో.. రాదనుకున్నారో కానీ ఇప్పుడు పీకే పేరును తెరపైకి తీసుకు వచ్చారు. ఎంత వర్కవుట్ అవుతుందో కాలమే నిర్ణయించాలి.