సూపర్‌స్టార్ రజనీకాంత్.. సినిమాల్లో ఆయన తిరుగులేని రాక్‌స్టార్..! కానీ రాజకీయనేతల్లో ఇలాంటి ఇమేజ్ సంపాదించుకుంటున్నాడు…ప్రశాంత్ కిషోర్. చివరికి ఆ రజనీకాంత్ కూడా ఈ పీకేని పిలిచి తన రాజకీయ పయనాన్ని డిజైన్ చేయమని కోరుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికలపైనే తన ఫోకస్ అని రజనీకాంత్ గతంలోనే చెప్పారు. రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్‌తో రజనీకాంత్ భేటీ అయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఉద్దవ్ పార్టీకి సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అటు పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం మమతా బెనర్జీ పార్టీకి కూడా సేవలు అందించనున్నారు ప్రశాంత్ కిశోర్. అంటే ప్రశాంత్ కిశోర్ డైరీ ఫుల్‌గా ఉంది. ఆ ఎన్నికల తర్వాత రజనీకాంత్‌తో కలిసే అవకాశం ఉందంటున్నారు.
తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ప్రశాంత్‌కిశోర్ తన బృందంతో సర్వే చేయించారు. వాటి ఫలితాలపై చర్చించారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏ మాత్రం తప్పటడుగులు వేయకుండా… ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే రజనీకాంత్ పార్టీ పెట్టేందుకు ముందు ప్రశాంత్ కిశోర్‌ను కలిసినట్లు చెబుతున్నారు. సినిమాలో సూపర్‌స్టార్ అయినప్పటికీ.. రాజకీయాల్లో మాత్రం జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. అందుకే తనతో పాటు పీకే లాంటి వ్యూహకర్త సాయం కూడా తీసుకోవాలని చూస్తున్నారు. ఆప్తమిత్రుడు చిరంజీవి పొలిటికల్ ఫెయిలింగ్ ను చూసిన తర్వాత రజనీ మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారంటున్నారు.
రజనీకాంత్ మాత్రమే కాదు.. అంతకంటే ముందే మక్కళ్ నీతి మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహసన్ కూడా గతంలో ప్రశాంత్ కిశోర్‌ను కలిశారు. ఆయనతో సుధీర్ఘ చర్చలు జరిపి, రాజకీయపరంగా పార్టీలో పలు మార్పులు చేస్తున్నారు. కమల్ పార్టీ ఎక్కడా గెలవకున్నా… కొన్ని స్థానాల్లో మంచి ఓట్లు దక్కించుకున్నారు. స్టాలిన్ సారధ్యంలో డీఎమ్‌కే బలంగా ఉంది. ఆయనకు పోటీ ఇచ్చే ధీటైన నాయకుడు ఇతర పార్టీలకు కరవయ్యారు. స్టాలిన్‌కు ధీటుగా ఓ నేతని తయారు చేసే బాధ్యత పీకే తీసుకున్నారు. ఈ నేత రజనీకాంతే కావాలని… ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.