ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబర్లో రిటైర్ అవుతున్నారా అంటే.. అలాంటి చాన్స్ లేదని నూటికి 99 శాతం మంది అనుకుంటారు. కానీ ఆ ఒక్క మాత్రం కొన్ని ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. వారిలో శివసేన ఉద్దవ్ ధాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్ కూడా ఉంటారు. ప్రధానమంత్రి మోదీ ఆదివారం నాగపూర్ లోని ఆరెస్సెస్ కార్యాలయంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ సెప్టెంబర్ లో రిటైర్ కావాలనుకుంటున్నారని ఆ విషయాన్నే ఆయన ఆరెస్సెస్ ముఖ్యులతో మాట్లాడారని చెప్పుకొచ్చారు.
ప్రధానమంత్రి మోదీ చాలా కాలంగా ఆరెస్సెస్ కార్యాలయానికి వెళ్లలేదు. ఇదే విషయాన్ని సంజయ్ రౌత్ చెబుతున్నారు. దేశ నాయకత్వంలో మార్పు రావాలని ఆరెస్సెస్ కోరుకుంటోందని ఆయన చెబుతున్నారు. తనకు అత్యంత విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. బీజేపీలో 75 ఏళ్ల నిబంధనను గతంలో తీసుకు వచ్చారు. ఈ నిబంధన కారణంగా అద్వానీ, మురళీమనోహర్ జోషి, వెంకయ్యనాయుడు వంటి సీనియర్ నేతలకు విశ్రాంతినిచ్చారు. అదే రూల్ మోదీకి అప్లయ్ చేస్తారా అన్న ప్రశ్నలు కొంత కాలంగా వస్తున్నాయి.
సెప్టెంబర్ 17వ తేదీకి ఆయనకు 75 ఏళ్లు వస్తాయి. అందుకే సంజయ్ రౌత్ ఊహాగానాలను ప్రారంభించారని అనుకోవచ్చు. అయితే మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ రిటైరయ్యే అవకాశం ఉండదని బీజేపీ వర్గాల్లో గట్టి నమ్మకం ఉంది. మోదీ లేని నాయకత్వాన్ని అంగీకరించే అవకాశం ఉండదు. పార్టీ కోరిక మేరకు ఆయనకు 75 ఏళ్ల నిబంధన నుంచి మినహాయిపు లభించడం సహజమే. కానీ.. అప్పటి వరకూ ఆయన రిటైర్మెంట్ పై చర్చలు జరుగుతూనే ఉంటాయని అనుకోవచ్చు