డిసెంబరు 5న ‘పుష్ప 2’ విడుదల కానుంది. నవంబరు 20 నాటికి తొలి కాపీ సిద్ధమైపోవాలన్నది నిర్మాతల టార్గెట్. అయితే… అది సాధ్యం కాలేదు. ఈరోజు కూడా ‘పుష్ప 2’కి సంబంధించిన ప్యాచ్ వర్క్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈరోజు అర్థరాత్రి వరకూ షూటింగ్ ఉండొచ్చు. ఈ రోజుతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఫస్టాఫ్ ఆర్.ఆర్. ఇప్పటికే పూర్తయ్యింది. సెకండాఫ్‌కు సంబంధించిన వర్క్ కూడా ఓవైపు వేగంగా సాగిపోతోంది. ఈ నెలాఖరుకు ఫస్ట్ కాపీ చేతిలో ఉంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాల్ని కూడా ముమ్మరం చేసింది చిత్రబృందం. ఇప్పటికే పాట్నాలో ఓ మెగా ఈవెంట్ నిర్వహించింది. చెన్నైలో కిస్సిక్ పాట విడుదల చేశారు. ఈనెల 27న కొచ్చిలో ఓ ఈవెంట్ ఉంది. ఆ తరవాత హైదరాబాద్ లో ఓ భారీ వేడుక నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పోలీసుల అనుమతులు కూడా వచ్చేసిందని తెలుస్తోంది. యూసుఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ జరిగే ఛాన్స్ వుంది. దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ అస్తవ్యస్తమైన నేపథ్యంలో ఈ ఈవెంట్ పకడ్బందీగా నిర్వహించాలని చిత్రబృందం భావిస్తోంది. ఎలాంటి అవాంతరాలకూ చోటు ఇవ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్ ఈవెంట్ అయిన తరవాత బెంగళూరులో మరో ప్రమోషన్ కార్యక్రమం జరగనుంది. ముంబైలోనూ ఓ ప్రెస్ మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది. దాంతో ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తవుతాయి. బన్నీ ఈసారి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తాడా, లేదా? అనే సందేహం ఉంది. కామన్ ఇంటర్వ్యూలు చేసి, మీడియాకు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ అదే చేస్తున్నారు. ఇప్పుడు బన్నీ కూడా ఇదే పంథా పాటిస్తాడా, లేదంటే మీడియాతో మాట్లాడతాడా? అనేది ఆసక్తిగా మారింది. సుకుమార్ అయితే.. సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ మీడియా ముందుకు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్స్ లో ఆయన అంత బిజీగా ఉన్నారు.