రాహుల్ గాంధీ నేపాల్‌లోని ఓ నైట్ క్లబ్లో చైనాకు చెందిన మహిళతో ఉన్న వీడియోను కొంత మంది ఒక్క సారిగా వైరల్ చేశారు. వెంటనే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే రాహుల్ గాంధీ నైట్ క్లబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నారని కొంత మంది.. కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితుల్లో రాహుల్ జల్సా చేస్తున్నారని మరికొందరు..ఆయన నియోజకవర్గం వయనాడ్‌లో స్మృతి ఇరానీ పర్యటిస్తూంటే.. రాహుల్ మాత్రం నేపాల్‌కు వెళ్లారని మరికొందరు కామెంట్లు చేయడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఎలా కావాలంటే అలా విస్తృతంగా ప్రచారం చేయగల బీజేపీ టీంలు ఈ వీడియోతో విస్తృతంగా తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.
వాస్తవం ఏమిటంటే… రాహుల్ గాంధీకి బాగా పరిచయస్తుడైన ఓ నేపాల్ జర్నలిస్టు పెళ్లికి రాహుల్ గాందీ వెళ్లారు. ఖాట్మండులో జరిగిన ఆ పెళ్లి పార్టీని ఆ జర్నలిస్టు ఓ నైట్ క్లబ్లో ఏర్పాటు చేశారు. ఆపార్టీకి హై ప్రోఫైల్ వ్యక్తులందరూ హాజరయ్యారు. నేపాల్‌లో చైనా రాయబారి అయిన యో హంకీ కూడా హాజరయ్యారు. రాహుల్తోఉన్న మహిళ ఈ చైనా రాయబారినే. పెళ్లికి వెళ్లడం తప్పెలా అవుతుందని కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేతల్ని ప్రశ్నిస్తోంది.
నేపాల్ మీడి్యా కూడా రాహుల్ గాంధీ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చారని రిపోర్ట్ చేసింది. అయితే రాహుల్ మాత్రం నైట్ క్లబ్ లో చైనా యువతితో పార్టీ చేసుకునేందుకు వెళ్లాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ విమర్శలను తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడుతోంది. పిలిచిన పెళ్లికే రాహుల్ వెళ్లారని మోదీలాగా పిలవకుండా.. కరాచీకిపోయి షరీఫ్ పుట్టిన రోజు వేడుకల్లో విందు ఆరగించి రాలేదని విమర్శిస్తున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ నైట్ క్లబ్ విజువల్సే ఇప్పుడు దే్శానికి పెద్ద సమస్య అయిపోయింది.