ఆర్.ఆర్.ఆర్ సినిమాకి రాజమౌళి గట్టిగానే ప్రమోషన్లు చేయించాడు. కాకపోతే.. అవన్నీ ప్రీ ప్లాన్డ్. రికార్డెడ్ ఇంటర్వ్యూలు. మీడియా వాళ్లతో సంబంధం లేని ఇంటర్వ్యూలు. వాళ్లే రికార్డ్ చేసి, ఆ ఫుటేజీ మీడియాకి ఇచ్చారే తప్ప… ఇందులో ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా ఇన్వాల్మెంట్ లేదు. చివర్లో కొన్ని టీవీ ఛానళ్లని పిలిచి మాట్లాడారు. అది కూడా తూ.తూ మంత్రం లాంటి కార్యక్రమమే. ప్రింట్ మీడియాకి ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. అది వేరే విషయం.
సినిమా విడుదలైన తరవాత ఇప్పుడు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఇండియా అది పెద్ద బ్లాక్ బస్టర్ అనే పేరొచ్చినా, వందల కోట్ల వసూళ్లు కుమ్మేస్తున్నా… సక్సెస్ మీట్ లాంటిది లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ అయ్యాక.. `సక్సెస్ మీట్ పెడదాం..` అని దిల్ రాజు ఓ ప్రతిపాదన తీసుకొచ్చినట్టు టాక్. కానీ.. రాజమౌళి అందుకు `నో` చెప్పాడట. నిజానికి రాజమౌళికి తెలుగు మీడియా అంటే కొంత కోపం ఉంది. `బాహుబలి 1`ని ప్రపంచమంతా కీర్తిస్తున్నప్పుడు తెలుగు మీడియాలో మాత్రం నెగిటీవ్ కథనాలు వచ్చాయి. రేటింగుల విషయంలోనూ రాజమౌళి హర్టయ్యారని టాక్. అందుకే బాహుబలి 2 సమయానికే మీడియాని పట్టించుకోవడం మానేశారు. ఆర్.ఆర్.ఆర్కీ అదే జరిగింది. తప్పదని చెప్పి ఒకట్రెండు ప్రెస్ మీట్లు పెట్టించారంతే. సినిమా రిలీజ్ అయిపోయాక… అసలు పట్టించుకోకపోవడానికి కూడా కొన్ని కారణాలున్నాయి.
ఆర్.ఆర్.ఆర్ సినిమాకీ కొన్ని చోట్ల నెగిటీవ్ రివ్యూలొచ్చాయి. ముఖ్యంగా తెలుగులో. అవన్నీ రాజమౌళి దృష్టికి వెళ్లాయి. తన సినిమాని ఇలా జడ్జ్ చేస్తారా? అనే కోపం రాజమౌళికి ఈసారి మరింత ఎక్కువ వచ్చిందని, అందుకే మీడియాకి, సక్సెస్ మీట్లకీ ఆయన దూరంగా ఉన్నారని, ఇక ముందు కూడా ఇదే ఫార్ములా అనుసరించాలని రాజమౌళి ఫిక్స్ అయ్యాడని సమాచారం.