`ఆర్.ఆర్.ఆర్`కి సంబంధించిన రెండు టీజర్లు బయటకు వచ్చాయి. రామ్ చరణ్ ని అల్లూరి సీతారామరాజుగా చూపించి మెప్పించాడు రాజమౌళి. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ ని చూపించాడు. ఈ రెండు టీజర్లూ.. ఈ సినిమా స్థాయేమిటో, ఆ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో చెప్పడానికి ఓ మచ్చు తునక. రాజమౌళి స్టైల్లోనే సాగుతూ.. అభిమానుల్ని మెప్పించాయి.
అయితే కొమరం భీమ్ పాత్ర ని చూపించిన విధానంపై మాత్రం విమర్శలొచ్చాయి. కొమరం భీమ్ నెత్తిమీద ముస్లిం టోపీ చూసి జనాలు మండి పడ్డారు.చరిత్రని వక్రీకరించొద్దూ.. అంటూ రాజమౌళిపై ఘాటైన విమర్శలు చేశారు. కొమరం భీమ్ పాత్ర ఈ సినిమాపై తొలి వివాదాన్ని సృష్టించింది. అయితే అల్లూరి సీతారామరాజు పాత్ర కూడా అందుకు అతీతం కాదేమో అనిపిస్తోంది. సీతారామరాజుని ఓ పోలీసు అధికారిగా చూపించబోతున్నాడట రాజమౌళి. పైగా జలియన్ వాలా బాగ్ కి సంబంధించిన ఓ ఎపిసోడ్ ఈ సినిమాలో ఉందని తెలుస్తోంది. జలియన్ వాలా బాగ్ కీ అటు అట్లూరికీ,ఇటు కొమరం భీమ్ కి సంబంధమే లేదు. కానీ.. అల్లూరి సీతారామరాజు ఈ జలియన్ వాలా బాగ్ ఘటనలో పాల్గొన్నాడన్న అర్థం వచ్చే రీతిలో ఓ సన్నివేశాన్ని డిజైన్ చేశాడట. అది కూడా విమర్శలకు తావిస్తుందేమో అనిపిస్తోంది. కొమరం భీమ్ నిజాంలపై పోరాడాడు. తనని ఓ ముస్లింగా చూపించాడు రాజమౌళి. అల్లూరి సీతారామరాజు తెల్ల దొరలపై పోరాటం చేశాడు. పోలీస్ స్టేషన్ ని భూస్థాపితం చేశాడు. అలాంటి అల్లూరి ఖాకీ బట్టల్లో చూపిస్తున్నాడు. మొత్తానికి రాజమౌళి స్కెచ్ వేరేలా కనిపిస్తోందిప్పుడు.
ఇది అల్లూరి, కొమరంల కథ కాదు. ఆ పాత్రల్ని స్ఫూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్న ఫిక్షన్. సినీ అభిమానులూ అలానే చూడాలి. కాకపోతే.. రాజకీయ నాయకులు, పార్టీలు, విమర్శకులు.. వేరే కోణంలో చూస్తే మాత్రం విమర్శలు, వివాదాలూ తప్పవు.