బయోపిక్ కాని బయోపిక్‌ని నెత్తిమీద వేసుకున్నాడు జక్కన్న రాజమౌళి. ఒకేసారి ఇద్దరు వీరుల కథల్ని, అదీ మనకు తెలియని కథని చెప్పడం మాటలు కాదు. అందుకోసం జక్కన్న చాలా కసరత్తులే చేసుంటాడు. కాకపోతే సినిమా విడుదలైన తరవాత.. జక్కన్న వివాదాల్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ తీసినప్పుడు విమర్శకులు చెలరేగిపోయారు. ఓ విప్లవవీరుడి కథలో రొమాన్స్ చూపించడం ఏమిటని? పాటలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
‘ఆర్.ఆర్.ఆర్’లో చరణ్ పాత్ర.. అల్లూరి సీతారామరాజుది. ఆ పాత్రకు ఓ హీరోయిన్, రొమాన్స్… కమర్షియల్ అంశాల దృష్ట్యా తప్పని కొలతలు. వీటిని విమర్శకులు ఎలా స్వీకరిస్తారు? అనేది చూడాలి. కొమరం భీమ్ చరిత్ర తెలియంది కాదు. తెలంగాణ యువకులంతా భీమ్‌ని ఔపోసాన పట్టేశారు. భీమ్ గురించి ఏం చెబుతారా? ఎలా చూపిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అటు అల్లూరి, ఇటు కొమరం.. ఇద్దరి జీవితాల్లో జరిగిన కథలేవీ జక్కన్న చూపించకపోవొచ్చు. ఇది కేవలం.. జక్కన్న ఊహే కావొచ్చు. కానీ.. పాత్రలకు అల్లూరి, భీమ్ పేర్లు పెట్టడం వల్ల.. ఇది వాళ్ల కథే… అని ప్రేక్షకులు ఫిక్సయిపోతారు. ఇప్పుడు ‘చరణ్ పాత్ర ఎక్కువ ఉందా? ఎన్టీఆర్ పాత్ర ఎక్కువ ఉందా?’ అన్నది పాయింటు కాదు. ‘మా ఆంధ్రా వీరుడ్ని బాగా చూపించాడా? మా తెలంగాణ యోధుడ్ని బాగా చూపించాడా’ అన్నదే పెద్ద తలకాయ నొప్పి వ్యవహారం. అంటే.. ఇమేజ్‌లు హీరోల్ని దాటి – విప్లవ వీరుల వరకూ వెళ్లాయన్నమాట.
అయితే జక్కన్న వివాదాలకు భయపడే రకం కాదు. ”నా సినిమా గురించి ఎవరో ఏదో ఒకటి మాట్లాడుకోవడం చాలా సర్వసాధారణం అయిపోయింది. బాహుబలి గురించి కూడా ఇలానే మాట్లాడారు. కృష్ణగారు అల్లూరి సీతారామరాజు తీస్తున్నప్పుడు వివాదాలు వచ్చాయని, ఆయన సినిమా ఆపలేదు. అన్నమయ్య సమయంలోనూ ఇంతే. మన దగ్గర మంచి కథ ఉన్నప్పుడు ఇలాంటి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు” అంటూ తేల్చేస్తున్నాడు జక్కన్న. అంతేకాదు.. ఈ సినిమా చూశాక.. అల్లూరి పాత్రలో చరణ్‌ని ఎంత ప్రేమిస్తారో, కొమరం పాత్రలో భీమ్నీ అంతే ప్రేమిస్తారని హామీ ఇస్తున్నాడు. తన సినిమాల్లోని హీరోల్ని అసమాన వీరులుగా చూపించే జక్కన్నకు ఇప్పుడు రియల్ లైఫ్ వీరులు దొరికారు. ఇక హీరోయిజం ఆకాశాన్ని తాకడం ఖాయం. అయితే… జక్కన్న బ్యాలెన్స్ చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది.. ఒక్కటే. ఇది ఎన్టీఆర్ – చరణ్‌ల సినిమా కాదు, ఇది అల్లూరి – కొమరంల కథ అని.