రజనీ కాంత్ కి అధికారం దక్కడం అసాధ్యం, మహా అయితే కారైకుడి ఆచ్చిని దక్కించుకోగలరేమో.. ఇది మంత్రి సెల్లూర్ రాజ్ విమర్శ. నిన్న కురిసిన వర్షంలో ఈరోజు పుట్టిన పుట్టగొడుగు, త్వరలో కనుమరుగైపోతారు… ఇదీ రజనీకాంత్ ని ఉద్దేశించి మంత్రి జయకుమార్ వ్యాఖ్యానమే. వీరేకాదు, అన్నాడీఎంకేకి చెందిన ఇతర నేతలు, వక్తలు రజనీపై మూకుమ్మడి విమర్శలు పెంచారు. ఉన్నట్టుండి ఈ స్థాయిలో విమర్శలు పెంచారంటే, రాజకీయంగా రజనీ ఎదుగుతున్నారనే స్పష్టమైన సమాచారం వారికి ఉన్నట్టు లెక్క. సరిగ్గా జరిగిందీ అదే.
సూపర్ స్టార్ రజనీ ఈ మధ్య అమెరికా వెళ్లొచ్చారు. ఆయన తిరిగి వచ్చే గ్యాప్ లోనే నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వం ఒక రహస్య సర్వే చేయించింది. దీన్లో బయటపడ్డ వాస్తవాలు ఆ పార్టీకి కళ్లుబైర్లు కమ్మేలా చేశాయని సమాచారం. రాష్ట్రంలోని 234 నియోజక వర్గాల్లోని 150 స్థానాల్లో ప్రజలు సూపర్ స్టార్ కు మద్దతుగా ఉన్నారట. ఈ నియోజక వర్గాల్లో రజనీకాంత్ కి 35 నుంచి 40 శాతం ఓటు బ్యాంకు సాలిడ్ అని రహస్య సర్వే తేల్చినట్టు సమాచారం. దీన్లో దళితులు 15 శాతం, మైనారిటీలు 8 శాతం, ఇతర సామాజిక వర్గాలు వారంతా మరో 15 శాతం రజనీ కాంత్ కి మద్దతుగా నిలుస్తున్నట్టు ఈ సర్వే తేల్చింది. ఈ సర్వే ఫలితాలపై అధికార పార్టీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్టు సమాచారం. దీంతో ఇప్పట్నుంచే ఎదురుదాడి మొదలుపెట్టాలని నిర్ణయించారట. ఆ మేరకు మంత్రులు, నేతలు, పార్టీ వర్గాలకు రజనీని విమర్శించాలంటూ మౌఖిక ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. అందుకే, మంత్రులు ఇతర నేతలు ప్రెస్ మీట్లలో, టీవీ ఛానెళ్ల డిబేట్లలో రజనీని ఎదుర్కోవడం మొదలుపెట్టారు.
రాజకీయంగా రజనీ ప్రభావం ఏమీ ఉండదనే ఒక అభిప్రాయాన్ని ప్రచారంలోకి తేవాలని భావిస్తున్నారు. అయితే, ఈ వ్యూహాన్ని కూడా రజనీ సమర్థంగా ఎదుర్కొనేట్టుగానే ఉన్నారు. రాజకీయాల్లోకి వస్తానని తలైవా ప్రకటించినా, ఇంకా పార్టీ స్థాపించలేదు. ప్రస్తుతం రజనీ పీపుల్స్ ఫోరమ్ ని బలోపేతం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎంజీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రజనీ మాట్లాడుతూ… ఎంజీఆర్ తరహాలో సుపరిపాలన అందిస్తా అన్నారు. అంటే, అన్నాడీఎంకే కార్యకర్తలను ప్రసన్నం చేసుకునే కామెంట్ కదా ఇది! ఇంకోపక్క, కరుణానిధిని కూడా విమర్శించడం లేదు. దీంతో స్టాలిన్ ను వ్యతిరేకిస్తున్న నాయకుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి, తలైవా వ్యూహాత్మకంగా బలపడుతున్నారన్నది అధికార పార్టీ చేయించిన సర్వేలో బయటపడటం విశేషం. పార్టీ ప్రారంభానికి ముందే ఎన్ని విమర్శలు వినిపిస్తున్నా… వాటిపై స్పందించే కార్యక్రమం పెట్టుకోవడం మానేసి, పార్టీ పునాదుల్ని బలపరచడంపైనే రజనీ దృష్టి కేంద్రీకరిస్తున్నారు.