డిసెంబర్ 31- తన పొలిటికల్ ఎంట్రీ గురించి రజనీకాంత్ ప్రకటన చేస్తానన్న రోజు. అది రేపే! స్పష్టమైన రాజకీయ ప్రకటన మరి ఈ సారైనా వస్తుందా?
ఈ నెల 26 నుంచి అభిమానులతో రజనీకాంత్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో కూడా ఇప్పటిదాకా – ” మన జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. హోదా, సంపాదన కంటే సమయం చాలా విలువైనది. నిన్న శివాజీ గణేషన్, ఇప్పుడు నేను, రేపు మరొకరు.” లాంటి వేదాంతపర వ్యాఖ్యలు తప్పితే, స్పష్టమైన రాజకీయ వ్యాఖ్యలు రాలేదు.
ఇక విశ్లేషకుల అంచనా ప్రకారం – రేపు కూడా రజనీ ప్రకటన చేయకపోవచ్చు. రజనీ ఇప్పటిదాకా వేసిన అడుగులు చూసిన వారికి – కమల్ హాసన్, పవన్ కళ్యాణ్ లాగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే దూకుడు రజనీ ప్రదర్శించలేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే రజనీ కూడా , చిరంజీవి లాగా, ప్రతిచిన్న విషయాన్ని ఆచితూచి, చర్చించి, జనాలని మెంటల్ గా ప్రిపేర్ చేసి వారి అంచనాలకి అనుగుణమైన వ్యాఖ్యలు మాత్రమే చేసాడు. ఒకవేళ రేపు రాజకీయ ప్రకటన చేసే ఉద్దేశ్యం రజనీకి ఉన్నట్టైతే, ఈ పాటికే అందుకు అనుగుణమైన వ్యాఖ్యలు, అందుకు తగ్గ ప్రిపరేషన్ ప్రారంభమై ఉండేది. అటువంటిది ఏదీ జరగకపోవడం చూస్తూ ఉంటే, బహుశా రజనీ ఈ సారి కూడా ఏదీ తేల్చకుండా సమావేశాలని ముగించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
అయితే మళ్ళీ ఇంకొక కొత్త డెడ్ లైన్ తనకి తాను తీసుకుంటాడా? లేక ఏదైనా అస్పష్ట ప్రకటన తో సరిపెడతాడా అనేది వేచి చూడాలి.