రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ విషయంలో సంప్రదాయాలు ఉల్లంఘించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కసరత్తు మొదలు పెట్టారు. సహజంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పోస్టును విపక్షాలకు ఇస్తూ ఉంటారు.కానీ మోడీ మాత్రం దాన్ని బీజేపీ ఖాతాలో లేదా.. తమకు అనుకూలంగా ఉన్న పార్టీల ఖాతాలో వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ దృష్టిలో టీఆర్ఎస్ ప్రముఖంగా ఉంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ కేశవరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కురియన్ పదవీ కాలం ముగియడంతో ఆగస్టులో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరగనుంది.
బీజేపీకి రాజ్యసభలో మెజార్టీ లేదు. కానీ ఎంపీలు ఎక్కువగా ఉన్న పార్టీ బీజేపీనే. డిప్యూటీ చైర్మన్ పదవిని పొందాలంటే ఇతర పార్టీల మద్దతు అవసరం. మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు 122 మంది సభ్యుల మద్దతు అవసరం. బీజేపీకి 69 మంది సభ్యులున్నారు. ఎన్డీఏ పక్షాలతో కలుపుకుంటే 100 మంది అవుతారు. బీజేపీకి ఇకంకా 22 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంది. ఈ పదవి విపక్షాలకు దక్కేలా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో ఆమె సుదీర్ఘంగా మంతనాలు జరిపారు కూడా. కాంగ్రెస్ మద్దతుతో ఇతర పార్టీలకు చెందిన నేతను డిప్యూటీ చైర్మన్‌గా నిలబెట్టాలని ప్రయత్నాలు దీదీ ప్రయత్నం.
విపక్షాలను దెబ్బ కొట్టేందుకు బీజేపీ అన్ని అవకాశాలనూ పరిశీలిస్తోంది. అవసరమైతే టీఆర్ఎస్ లేదా బీజేడీకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్కు రాజ్యసభలో ఆరుగురు, బీజేడీకి తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. ఈ రెండు పార్టీల్లో ఎవరికైనా డిప్యూటీ చైర్మన్ పదవిని ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. బీజేడీ మాత్రం… కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరం పాటిస్తోంది. పదవి తీసుకుంటుందన్న నమ్మకం లేదు.
ఇక మిగిలింది తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే. బీజేపీ, మోదీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న టీఆర్ఎస్.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పోస్టును అంగీకరించే అవకాశం ఉంది. అయితే బీజేపీ మద్దతుతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని తీసుకుంటే ముస్లింలకు దూరం అవుతామనే భావన వస్తే మాత్రం వేరే వ్యూహం అవలంభించే అవకాశం ఉంది. అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా మద్దతు ఇస్తే ఈ పదవిని తీసుకునేందుకు టీఆర్ఎస్ సుముఖంగా ఉంది. ఒకవేళ ఇదే జరిగితే టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావుకు ఈ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి మోదీ వ్యూహంతో… టీఆర్ఎస్కు కీలకమైన పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇది ఆ పార్టీకి రాజకీయంగా నష్టమా…లాభమా అన్నది మాత్రం ఎన్నికల తర్వాతే క్లారిటీ వస్తుంది.