తొలి హిట్ అందుకున్న తరవాత.. నాన్ స్టాప్‌గా తన కెరీర్‌ని పరుగులెట్టించిన కథానాయిక.. రకుల్ ప్రీత్ సింగ్. నిన్నా మొన్నటి వరకూ.. ఏ సినిమాలో చూసినా రకులే. ముందు తన డేట్లు ఉన్నాయో లేదో చూసుకుని, తనకు కుదరకపోతే, అప్పుడు మరో కథానాయికని వెదుక్కునేవాళ్లు. అందుకే ఈ నాలుగేళ్ల కాలంలో లెక్కకు మించి సినిమాలు చేసింది రకుల్. తన కెరీర్లో ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా గడిపింది. అలాంటి రకుల్ పరిస్థితి ఇప్పుడు తారుమారు అయిపోయింది. తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేని కథానాయిక రకుల్ ఒక్కత్తే. ఇలాంటి స్థితి రకుల్ ఇదివరకు లేదు. బాలీవుడ్లో ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన అయ్యారే.. డిజాస్టర్ అయ్యింది. ఇక మీదట రకుల్‌కి బాలీవుడ్లో ఛాన్సు రావడం గగనమే. తమిళంలో రెండు ప్రాజెక్టులున్నా.. తన దృష్టి ఇప్పుడు తెలుగు సినిమాపైనే ఉంది. రకుల్ నటించిన తెలుగు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం, ఆమె ఖాతాలో `స్పైడర్`లాంటి డిజాస్టర్ చేరడం, రకుల్ పారితోషికం కోటికిపైగానే ఉండడం.. ఇవన్నీ ప్రతికూల అంశాలు. ఫ్లాపులు ఎదురైనప్పుడు పారితోషికం తగ్గించుకోవాల్సిందే. రకుల్ ఇప్పుడు అలాంటి ఆఫర్లు ఇవ్వాలి. లేదంటే.. నిర్మాతలు కొత్తమ్మాయిలనే నమ్ముకోవాల్సిరావొచ్చు. ఈ నిజం గ్రహించి రకుల్ ఎంత త్వరగా కళ్లు తెరిస్తే అంత మంచిది. లేదంటే తాను కూడా తొందరగా ఫేడవుట్ అయిన కథానాయికల జాబితాలో చేరిపోయే ప్రమాదం ఉంది.