వివాదం ఎక్కడుంటే అక్కడ అడక్కుండానే ప్రత్యక్షమైపోతాడు రాంగోపాల్ వర్మ. అందులోనూ తనకు ఇష్టమైన వ్యక్తుల చుట్టూ ఆ వివాదం నడుస్తుంటే.. ఇంకొంచెం మజా వచ్చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ అనే కాకుండా యావత్ చిత్రసీమ హాట్ హాట్‌గా మాట్లాడుకుంటున్న అంశం.. శ్రీదేవి మరణం. ఆమెది సహజమరణమైతే `అయ్యో` అనుకుని ఆగిపోయేవాళ్లే. కానీ `ప్రమాదవశాత్తూ` అనే సరికి త్త కొత్త పాయింట్లు, అనుమానాలు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ వర్మని కదిలిస్తాయన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన శ్రీదేవికి వీరాభిమాని. శ్రీదేవిపై తనకున్న ఇష్టాన్ని వర్మ చాలాసార్లు ప్రస్తావించాడు. నా ఇష్టం బుక్కులో పేజీల కొద్దీ వర్ణించాడు. రాఘవేంద్రరావు `సౌందర్యలహరి` పోగ్రాంలో కూడా గంటల కొద్దీ మాట్లాడాడు. శ్రీదేవి మరణంతో అత్యంత చలించిపోయిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా వర్మనే. శ్రీదేవి జీవితంలోని పలు కోణాల్ని సృశిస్తూ వర్మ రాసిన ఆర్టికల్ అందరి దృష్టినీ ఆకట్టుకుంది. ఇప్పుడు వర్మని.. శ్రీదేవి మరణం ఆకర్షిస్తుందని సినీ జనాల నమ్మకం. పైగా బయోపిక్ల్ని తీయడం అంటే తనకు చాలా చాలా ఇష్టం. శ్రీదేవి తో పని చేసిన అనుభవం కూడా వర్మకి ఉంది. వర్మ ఓ బయోపిక్, అందులోనూ తనకిష్టమైన నటిపై తీస్తున్నాడంటే కచ్చితంగా దానిపై ఫోకస్ పడుతుంది. అది చాలు.. వర్మలోని క్రియేటర్ మేల్కోవడానికి. రేపో.. మాపో వర్మ నుంచి శ్రీదేవి బయోపిక్ తీస్తున్నానహో అనే న్యూస్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. వర్మ కొన్ని బయోపిక్‌లు తీశాడు. ఇంకొన్ని ప్రకటించి వదిలేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయెపిక్ తీస్తానంటున్నాడు. కాకపోతే.. శ్రీదేవి కథని ఎంచుకుంటే మాత్రం వర్మ నూటికి నూరుపాళ్లూ న్యాయం చేస్తాడు. ఎందుకంటే శ్రీదేవిపై అంత పిచ్చి పెట్టుకున్న దర్శకుడు ఇండియాలోనే మరొకడు కనిపించడు కాబట్టి. సో.. వర్మాజీ.. బయోపిక్ మొదలెట్టండి మరి.