జగన్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని ఆన్నీ అడిఆశలయ్యాయని మరోసారి రమణదీక్షితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ తిరుమల పర్యటన సందర్భంగా ఆయనకు పిలుపు రాలేదు. ఎలాంటి గౌరవమూ దక్కలేదు. దీంతో ఆయన ఫీలైనట్లుగా ఉన్నారు. వెంటనే ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసి.. గతంలో నియమించిన వన్ మ్యాన్ కమిటీ రిపోర్టును ప్రకటిస్తారని ఆశించామని కానీ జగన్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం వల్ల చాలా నిరాశ చెందామన్నారు. టీటీడీలో బ్రాహ్మణ వ్యతిరేక సభ్యులున్నారని వారి నుంచి అర్చకుల్ని కాపాడటానికి వన్ మ్యాన్ కమిటీ రిపోర్టు ముఖ్యమన్నారు.
గతంలో తిరుమల ఆలయంలో చక్రం తిప్పే రమణదీక్షితులు ఏం ఆశించారో కానీ పింక్ డైమండ్ పేరుతో తప్పుడు ఆరోపణలు చేసి .. తెలుగుదేశం పార్టీపై బురద చల్లారు. ఆయన చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి చోట్ల కూడా ప్రెస్ మీట్లు పెట్టడంతో ఇదంతా కుట్రపూరిత ప్రచారం అని ప్రభు్త్వం నిర్ధారించుకుని ఆయనకు బలవంతంగా రిటైర్మెంట్ ఇచ్చింది. అప్పట్లో ఆయనకు జగన్ తాము అధికారంలోకి రాగానే మళ్లీ ప్రధాన అర్చకుడి పోస్టు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికీ ఆయనకు ఆలయంలో ప్రవేశం లేకుండా పోయింది.
రమణదీక్షితుల అవసరం కనిపించినప్పుల్లా ఒక్కో జీవో ఇస్తున్నారు. కానీ ఆ జీవోల వల్ల ఆయనకు ఒక్క రోజు సంతోషమే లభిస్తోంది కానీ.. మళ్లీ ఆలయంలో కీలకంగా వ్యవహరించే అవకాశం మాత్రం లభించడం లేదు. గత ఐదేళ్లుగా ఆయన పరిస్థితి అదే. జగన్ తన పోస్ట్ తనకు ఇస్తారని అనుకుంటున్నారు కానీ.. అలాంటి అవకాశం మాత్రం ఇవ్వడం లేదు. కానీ ఇప్పటికీ రమణదీక్షితులకు అర్థం కావడం లేదని ఆయన ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. కొసమెరుపేమిటంటే రమణదీక్షితులు చేసిన ఆరోపణలు తప్పని.. పింక్ డైమండ్ లేదని ప్రస్తుత టీటీడీ బోర్డు కూడా తేల్చేసింది.