రామ్‌చరణ్ హీరో, సుకుమార్ దర్శకుడు, సమంత కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ ఉండనే ఉన్నాడు… ఇన్ని హంగులు పెట్టుకుంటే కచ్చితంగా అది కమర్షియల్ సినిమా అయి తీరాలి. పైగా టైటిలేమో రంగస్థలం! ట్రైలర్లో కమర్షియల్ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చిత్రబృందం కూడా `మాది పక్కా కమర్షియల్ సినిమా` అని డంకా బనాయించి మరీ చెబుతోంది. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి మాటలు చూస్తుంటే ఇది అవార్డు సినిమానా?? అనే అనుమానాలు వస్తున్నాయి.
ఈ యేడాది అన్ని అవార్డులూ ఈ సినిమాకే వస్తాయి – జాతీయ అవార్డు వచ్చినా ఆశ్చర్యం లేదు. రాకపోతేనే అన్యాయం జరిగినట్టు అనుకోవాలి.. అని ఈ వేదికపై చిరంజీవి వ్యాఖ్యానించారు. మా సినిమా కోట్లు కొల్లగొడుతుంది.. వంద రోజులు ఆడుతుంది.. ఇలాంటి మాటలే వేదికపై వింటుంటాం. కానీ చిరంజీవి అవార్డు అనేసరికి మెగా అభిమానుల్లో కొత్త కంగారు మొదలైంది. సాధారణంగా అవార్డు సినిమాలన్నీ ఆర్ట్ సినిమాల్లానే ఉంటాయి. ఆఫ్ బీట్ తరహాలో సాగుతాయి. కమర్షియల్ మైలేజీ దొరకడం కష్టం. ఆ లెక్కన.. ఇది బాక్సాఫీసు దగ్గర ఏం చేస్తుందో అనే భయాలు మెగా ఫ్యాన్స్‌లో మొదలయ్యాయి. అయితే ఈమధ్య కమర్షియల్ సినిమాలకూ అవార్డులు వస్తున్నాయి. ఆ లెక్కన చూస్తే మాత్రం చిరు మాటలు టానిక్‌లా పనిచేస్తాయి. పొరపాటును.. మరీ వాస్తవికతకు దగ్గరగా వెళ్లి సుకుమార్ తీస్తే మాత్రం.. చిరు అన్నట్టు ఈ సినిమా అవార్డుల దగ్గరే ఆగిపోయే ప్రమాదం ఉంది. ట్రైలర్ చూస్తే… సుక్కు మరీ `రా` విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఇది అవార్డు సినిమానా, రికార్డు సినిమానా అనేది తేలాలంటే ఈనెల 30 వరకూ ఆగాల్సిందే.