ఎనిమిది నెలల కిందట రస్ అల్ ఖైమా అనే దేశం జారీ చేసిన ఇంటర్‌పోల్ నోటీసుతో సెర్బియా పోలీసులు నిమ్మగడ్డ ప్రసాద్‌ను.. అరెస్ట్ చేశారు. ఈ ఎనిమిది నెలల్లో ఆయనకు సంబంధించి.. ఆయన చేసిన మోసానికి సంబంధించిన రస్ అల్ ఖైమా కీలకమైన చర్యలు దిశగా ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన ఆస్తులన్నింటినీ జప్తు చేయడానికి.. రస్ అల్ ఖైమా ప్రయత్నాలు చేస్తోంది. ఇందు కోసం.. కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
గల్ఫ్ కోర్టుల తీర్పు ఇక్కడా వర్తింపు..!
కొద్ది రోజుల కిందట.. గల్ఫ్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన భారతీయులపై చర్యలు తీసుకునేందుకు.. .. ఆయా దేశాల కోర్టులకు అనుమతి ఇస్తూ.. భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్కడి కోర్టు తీర్పులు .. అక్కడ డబ్బులు ఎగ్గొట్టి ఇండియాకు వచ్చేసిన వారికి వర్తించేలా నిర్ణయాలు తీసుకుంది. ఇంత కాలం… అలాంటి అవకాశం లేదు. నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈ వెసులుబాటు లేదు. ఇటీవలే కేంద్రం ఈ ఆదేశాలు ఇవ్వడంతో .. రస్ అల్ ఖైమా వేగంగా రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. రస్ అల్ ఖైమా అనేది చిన్న దేశం. ఆ దేశ కోర్టుల్లో ప్రస్తుతం.. నిమ్మగడ్డ కేసు నడుస్తోంది. అక్కడి కోర్టులు ఏళ్ల తరబడి విచారణలు చేయవు. రేపోమాపో… నిమ్మగడ్డ కేసు తీర్పు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
నిమ్మగడ్డ కంపెనీలకు వందల కోట్లు తరలించిన రాకియా..!
మ్యాట్రిక్స్ అనే కంపెనీ పెట్టి… చాలా కొద్ది సమయంలోనే చాలా పెద్ద మొత్తానికి అమ్ముకుని వ్యాపార రంగంలో సంచలనం సృష్టించిన నిమ్మగడ్డ ప్రసాద్.. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిపోయారు. ఆయన వాన్ పిక్ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టుతో పాటు.. ఇతర ప్రాజెక్టుల్లో పెట్టుబడులంటూ.. దాదాపుగా ఎడెనిమిది వందల కోట్ల రూపాయలను నిమ్మగడ్డ ప్రసాద్… రస్ అల్ ఖైమా నుంచి సేకరించారు. రస్ అల్ ఖైమా… విశాఖ మన్యంలో బాక్సైట్ పై కూడా కన్నేసింది. మైనింగ్ కోసం అప్పట్లో వైఎస్ అనుమతులిచ్చారు. తర్వాత మారిన పరిస్థితులు, సీబీఐ కేసుల కారణంగా వాన్‌పిక్, బాక్సైట్ ఒప్పందాలను చంద్రబాబు రద్దు చేశారు. కానీ… రస్ అల్ ఖైమా పెట్టిన వందల కోట్లు పెట్టుబడిని మాత్రం నిమ్మగడ్డ తిరిగి ఇవ్వలేదు. ఇదే అసలు కేసు.
ఆ పెట్టుబడులన్నీ వెనక్కివ్వకపోతే తీగలాగడమే..!
రస్ అల్ ఖైమా దేశ ప్రభుత్వానికి చెందిన అన్‌రాక్ కంపెనీ ప్రస్తుతం నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి రూ. 2800 కోట్ల వరకూ రావాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ మొత్తం ఇచ్చి సెటిల్మెంట్ చేసుకుంటే..సరి. లేకపోతే.. ఆయన ఆస్తులను జప్తు చేయడానికి కోర్టు ద్వారా పని పూర్తి చేయవచ్చంటున్నారు. ఒక వేళ నిమ్మగడ్డ ప్రసాద్ ఆస్తులు రస్ అల్ ఖైమా జప్తు చేయడం అంటూ జరిగితే..ఆ వ్యవహారంతో ముడిపడి ఉన్న అనేక లింకులు బయటకు వస్తాయని చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఢిల్లీలోనూ చర్చనీయాంశమవుతోంది.