టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు పోలీసులు ఇచ్చిన గడువు ఉదయం పదకొండు గంటలకు. సీఆర్పీసీ సెక్షన్ 41 ప్రకారం నోటీసులు జారీ చేయడంతో.. హాజరు కాకపోతే.. అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. వ్యక్తిగత హాజరుకు తనకు కనీసం పది రోజుల పాటు సమయం కావాలని… న్యాయవాదుల ద్వారా సంప్రదింపులు జరిపినప్పటికీ పోలీసులు ఏ మాత్రం ఖాతరు చేయలేదు. వరుసగా రెండు రోజుల పాటు సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేసి.. మూడో రోజు 41 నోటీసులు జారీ చేసి.. తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. దీంతో.. రవిప్రకాష్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం ఊపందుకుంది.
అలంద మీడియా – రవిప్రకాష్ మధ్య రాజీ చర్చలు..?
అయితే.. ఇది పూర్తిగా కార్పొరేట్ అంతర్గత వ్యవహారం కాబట్టి.. కొత్త యాజమాన్యంతో.. రాజీ చేసుకోవాలని.. రవిప్రకాష్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే ఆయన వర్గీయులు అలంద మీడియాకు చెందిన కొంత మంది పెద్దలతో సంప్రదింపులు ప్రారంభించారు. ఈ వివాదం ఇలా కొనసాగడం.. అటు టీవీ9 సంస్థకు..ఇటు రవిప్రకాష్‌కు ఇద్దరికీ చేటు చేస్తుంది కాబట్టి.. వివాదాన్ని ముగిద్దామని.. రవిప్రకాష్ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో.. అలంద మీడియా కూడా.. కొన్ని కీలకమైన విషయాలపై.. రవిప్రకాష్ స్పందనను బట్టి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్సీఎల్టీ కేసు మైనస్ ఫోర్జరీ, డేటాచోరీ కేసు..!?
రవిప్రకాష్‌పై… ఫోర్జరీ, డేటా చోరీ కేసులను అలంద మీడియా యాజమాన్యం నమోదు చేసింది. ఈ కేసులను వెనక్కి తీసుకుంటే… ఎన్సీఎల్టీలో ఉన్న కేసు విషయంలోనూ.. రవిప్రకాష్, శివాజీలు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత యాజమాన్య బదిలీపై.. ఇప్పటికీ ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోయేలా రవిప్రకాష్ చేసే అవకాశం ఉంది. శివాజీతో… రవిప్రకాష్ చేసుకున్న షేర్ల అమ్మకం ఒప్పందం విషయంలో.. ఎన్సీఎల్టీలో కేసు ఉంది. ఆ కేసు వల్ల.. కొత్త డైరక్టర్ల నియామకానికి ఇబ్బంది ఏర్పడకుండా.. రవిప్రకాష్ చూసే అవకాశం ఉంది.
ఇక కార్పొరేట్ వివాదం కూడా కొలిక్కి వచ్చినట్లే..?
నిజానికి రవిప్రకాష్‌ను.. అలంద మీడియాకు చెందిన ప్రతినిధులు ఇలా వెంటాడటానికి కారణం… శివాజీతో… రవిప్రకాష్ చేసుకున్న షేర్ల అమ్మకం ఒప్పందమేననే ప్రచారం ఉంది. కేవలం కొత్త డైరక్టర్ల నియామకానికి అడ్డుతగిలి.. యాజమాన్య బదిలీ జరగకుండా వివాదాలు సృష్టించే ఉద్దేశంలో దీన్ని తెరపైకి తెచ్చారని అలంద మీడియా భావిస్తోంది. అందుకే.. స్నేహితులైన శివాజీ, రవిప్రకాష్‌లు కూడబలుక్కుని మైనార్టీ వాటాదారులుగా తెరపైకి వచ్చి.. తమకు తెలియకుండా.. అమ్మకాలు జరిగాయనే వాదన వినిపిస్తున్నారంటున్నారు. నిజానికి రవిప్రకాష్.. అమ్మకానికి అంగీకారం తెలుపుతూ సంతకాలు చేశారు. శివాజీకి మాత్రం చెప్పలేదు. ఎందుకంటే.. అలంద మీడియా.. టీవీ9ను కొనుగోలు చేసే వరకూ.. ఆయనకు షేర్లు ఉన్నాయని ఎవరికీ తెలియదు. ఇప్పుడీ వివాదంపై రాజీకి వస్తే.. కేసు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది.