పారితోషికాలు లేకుండా, లిమిటెడ్ బడ్జెట్ తీసి, కమర్షియల్ గా గట్టెక్కాలన్న ధ్యేయంతో తీసిన సినిమా ‘మిస్టర్ బచ్చన్’. కానీ ఒక్కసారి బరిలో దిగాక.. బడ్జెట్లు ఎందుకు చేతుల్లో ఉంటాయి. రెక్కలు కట్టుకొని ఎక్కడికో ఎగిరిపోతాయ్. ‘మిస్టర్ బచ్చన్’ విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమాకు ముందు అనుకొన్న బడ్జెట్ (పారితోషికాలతో సహా) రూ.70 కోట్లు. అది చివరికి రూ.90 కోట్లు అయ్యింది.
Also Read : రవితేజ.. బాబీ.. మరోసారి
ఆగస్టు 15న ఈ సినిమా విడుదల. రవితేజ – హరీష్ సినిమా కాబట్టి బయ్యర్లు కాస్త ఉత్సాహంగానే ఉన్నారు. రూ.20 కోట్లకు ఓటీటీ అమ్ముడుపోయింది. రూ.26 కోట్లు హిందీ డబ్బింగ్ రూపంలో వచ్చాయి. అంటే అక్కడికి రూ.46 కోట్లు తేలాయి. థియేట్రికల్ రూపంలో అటూ ఇటుగా రూ.30 కోట్లు రావొచ్చు. శాటిలైట్ రూపంలో మరో నాలుగు కోట్లు రావొచ్చు. నైజాం నుంచి నిర్మాతలు రూ.15 కోట్లు ఆశిస్తున్నారు. కానీ బేరం మాత్రం రూ.12 దగ్గర ఆగిపోయింది. ఓవర్సీస్ ఎలాగూ నిర్మాతలే సొంతంగా విడుదల చేసుకొంటారు. ఎటు చూసినా ఈ లెక్కలు రూ.80 కోట్ల దగ్గర ఆగుతున్నాయి. అంటే ఇంకా రూ.10 కోట్లు తరుగే ఉంది. నిజానికి ఈ సినిమాని ముందే అనుకొన్నట్టు రూ.70 కోట్లలో పూర్తి చేసి ఉంటే, రూ.10 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో సినిమా విడుదల అయ్యేది. ఇప్పుడు రూ.10 కోట్ల వెలితి కనిపిస్తోంది. సినిమా విడుదలై, మంచి విజయాన్ని అందుకొని, ఓవర్ ఫ్లోలు కనిపిస్తే తప్ప, ఈ లోటు పూడదు. మరి బచ్చన్ ఏం చేస్తాడో..?