సినిమాలని రీమేక్ చేయడం కొత్తకాదు. రీమేక్ సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ట్రాక్ రికార్డ్ మనది. సినిమా అనౌన్స్ మెంట్ రోజే ఫలానా సినిమాని రీమేక్ చేస్తున్నామని అనౌన్స్ చేయడం మామూలే. అయితే ఇప్పుడీ పద్దతి మారింది. కోట్లు పెట్టి రీమేక్ రైట్స్ తీసుకుంటున్నారు. కానీ రీమేక్ అనే సంగతి మాత్రం బయటికి చెప్పడం లేదు. రవితేజ రావణాసుర పరిస్థితి కూడా ఇలానే వుంది. రావణాసుర కోసం ‘విన్సీ డా’ అనే బెంగాళీ సినిమా కథని తీసుకున్నారు. అయితే విషయం మాత్రం బయటికి చెప్పడం లేదు.
డైలాగ్స్ తో పాటు కథ టైటిల్ శ్రీకాంత్ విస్సాకి ఇచ్చారు. ఆయన్ని ఈ సినిమా రీమేకా ? అని అడిగితే సమాధానం చెప్పడానికి చాలా మొహమాటపడ్డారు. రీమేక్ కాదని సూటిగా చెప్పలేకపోయారు. ”మీరు ఏ సినిమాకి రీమేక్ అనుకుంటున్నారో ఆ సినిమా చూడండి, ఈ సినిమా చూడండి తేడా మీకే తెలుస్తుంది’ అని చెప్పుకొచ్చారు శ్రీకాంత్.
ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. ఇలాంటి సినిమాల కథలో మెయిన్ ట్విస్ట్ కీలకం. ఒకవేళ రీమేక్ అని చెబితే ఒరిజినల్ సినిమా చూసి ట్విస్ట్ తెలుసుకుంటే.. అసలుకే మోసం వస్తుంది. అందుకే ఇది రీమేక్ అని చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్లు వుంది రావణాసుర టీమ్.