‘రోబో 2.ఓ’ సినిమా సెట్స్‌లోనే చాలా ఏళ్లు ఉండిపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలతో వచ్చే చిక్కే ఇది. గ్రాఫిక్స్ పనులు ఏ పట్టాన తెవలవు. అందుకే ఈ స్థాయిలో ఆలస్యం జరిగి ఉండొచ్చనుకున్నారు. పైగా శంకర్ మిస్టర్ పర్ఫెక్ట్ టైపు. ఏదీ అంత తేలిగ్గా నచ్చదు. అందుకే తీసిన సీనే మళ్లీ మళ్లీ తీస్తుంటాడు. దానికి తోడు త్రీడీ సినిమా కాబట్టి అది మరింత ఆలస్యం అవుతుంది. కాకపోతే… రోబో 2.ఓ ఆలస్యానికి మరో బలమైన కారణం కూడా ఉంది. అదే.. రజనీకాంత్ ఆరోగ్యం.
రోబో 2.ఓ మొదలైన కొన్ని రోజులకే రజనీ ఆరోగ్యం బాగా క్షీణించింది. వైద్యులు కనీసం ఆరు నెలలు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. ఓదశలో రజనీకాంత్ ‘నేను షూటింగ్ చేయలేను. ఈ సినిమా నుంచి తప్పుకుంటాను. కావాలంటే… ఇప్పటి వరకూ అయిన ఖర్చు వెనక్కి ఇచ్చేస్తా’ అని చెప్పారట. ఈ విషయాన్ని ఈరోజు చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రజనీనే చెప్పారు. ఈ మాటల్ని బట్టి చూస్తే ఆ స్థాయిలో రజనీ ఆరోగ్యం చెడిపోయిందా?? అనే అనుమానాలు వస్తున్నాయి. నిజంగానే ఆమధ్య రజనీ ఆరోగ్యం ఏమీ బాగాలేదు. చికిత్స నిమిత్తం విదేశాలకు కూడా వెళ్లారు. ఆ దశలో రజనీ ఆరోగ్యంపై చాలా పుకార్లు వచ్చాయి. వాటన్నింటినీ తోసి పుచ్చుతూ రజనీ కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం అందిస్తూ వచ్చారు. కానీ.. ఇప్పుడు రజనీ మాటల్ని బట్టి చూస్తే… నిజంగానే రజనీ ఆరోగ్యం ఆ రోజుల్లో .. బాగా క్షీణించిందని అర్థం అవుతోంది.
ఓ దశలో శంకర్ కూడా కలగ చేసుకుని.. ‘ఈ సినిమాని తాత్కాలికంగా ఆపేద్దాం… మీరు సంపూర్ణంగా కోలుకున్న తరవాతే మొదలెడదాం’ అని చెప్పారని, కానీ రజనీనే మళ్లీ ధైర్యం తెచ్చుకుని షూటింగ్లో పాల్గొన్నారని తెలుస్తోంది. శంకర్ కూడా చూచాయిగా ఇదే విషయం చెప్పుకొచ్చాడు. ‘మీరు సెట్‌కి రండి. మీ మొహం చూపించండి చాలు. మిగిలినది నేను చూసుకుంటా’ అని శంకర్ హామీ ఇచ్చాడట. ఇది విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యత ఇచ్చిన సినిమా. చాలా విషయాలు బ్లూ మేట్‌లోనే జరిగిపోతుంటాయి. నటీనటులకు సంబంధించిన స్కెచ్చులు ఉంటే చాలు. దాంతో.. గారడీలు చేసేయొచ్చు. బహుశా.. శంకర్ కూడా ఈ సినిమాలో అదే చేశాడేమో.
మొత్తానికి రజనీ ఆరోగ్యం కుదుట పడింది. రోబో 2. ఓని దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఇక ఆ వినోదాల్ని వెండి తెరపై ఆస్వాదించడమే తరువాయి.