తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించరు.. అనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. అది నిజం కూడా. మన సినిమాల్లో మెరిసే భామలంతా ముంబై నుంచో, గోవా నుంచో, కేరళ నుంచో దిగుమతి చేసుకున్నవాళ్లే. వాళ్లే స్టార్ హీరోయిన్లుగానూ చెలామణీ అయ్యారు. వాళ్లకు కోట్లకు కోట్లు పారితోషికాలు ఇచ్చి.. ఘనంగా గౌరవించుకుంటున్నాం. వాళ్లు కాల్షీట్లు అందించడమే మహా ప్రసాదం అనుకుంటున్నాం. అందుకే తెలుగు సినిమాల్లో వాళ్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. మన తెలుగు అమ్మాయిలు అస్సలు లేకుండా పోయారు.
ఈమధ్య ఓ తెలుగు నటి… ”తెలుగు అమ్మాయిలకు అన్యాయం జరుగుతోంది’ అంటూ మీడియా ముందు వాపోయింది. ఆమె ఆవేదనలో అర్థం ఉంది. కానీ.. ఇది పరమ ఓల్డ్ పాయింటే. కాకపోతే సదరు నటి పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలవైపు వేలెత్తి చూపిస్తోంది. `తెలుగు భాష అంటే అంత ఇష్టం అని చెబుతుంటావ్ కదా.. మరి నీ సినిమాల్లో తెలుగు హీరోయిన్లకు ఎందుకు అవకాశాలు ఇవ్వవు` అని అడిగింది. పాయింట్ బాగుంది గానీ… ప్రాక్టీకల్‌గా వర్కవుట్ కాని విషయమిది. తెలుగు సీమ నుంచి తయారైన కథానాయిల జాబితా ఓసారి చూద్దాం. ఈమధ్య కాలంలో తెలుగు నుంచి వచ్చి మెరిసిన వాళ్లు అర్చన (వేద), స్వాతి, అంజలి… వీళ్లు తప్ప పెద్దగా తెలిసిన మొహాలేం కనిపించవు. తెలుగు అమ్మాయిలు వచ్చినా.. ఒకట్రెండు సినిమాలకు పరిమితమై మాయమైపోయినవాళ్లే. స్వాతికి మంచి అవకాశాలే వచ్చాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలూ దక్కాయి. కానీ స్వాతి స్టార్ హీరో పక్కన నటిస్తే.. ‘భలే ఉంది లే జోడి..’ అని చప్పట్లు కొడతారా?? స్టార్ హీరోకి చెల్లెలు, మరదలు వరకూ స్వాతి ఓకే. కథానాయికగా సరితూగుతుందా?
అంజలికి ఆ అవకాశాలు వచ్చాయి కూడా. బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ.. ఇలా స్టార్ హీరోల పక్కన నటించింది. అర్చనకు ఆ అవకాశాలు రాలేదు. వీళ్లలో బోల్డంత టాలెంట్ ఉంది గానీ, స్టార్ హీరోలు మాత్రం పట్టించుకోలేదు… అనిపించుకున్న తెలుగు కథానాయిక ఒక్కరూ మనకు కనిపించరు. అలాంటప్పుడు అన్యాయం చేసినట్టు ఎందుకు అవుతుంది?? సినిమా వాళ్ల లెక్కలు.. వాళ్లకుంటాయి. ఏ కథానాయికని తీసుకుంటే బిజినెస్ బాగా జరుగుతుందో ఆలోచిస్తారు. అలా ఆలోచించడం తప్పు లేదు. తెలుగులో మహా అద్భుతమైన నటులు ఉన్నప్పటికీ పరాయి భాష వైపు పరుగులు తీస్తున్నారంటే అప్పుడు ఎవరినైనా తప్పు పట్టొచ్చు. కానీ… అంత సీన్ మాత్రం కనిపించడం లేదు.
‘మా’ విషయంలో మాత్రం కాస్తంత తప్పు కనిపిస్తోంది. తెలుగులో టాప్ స్టార్లుగా చలామణీ అవుతున్న కథానాయికల్లో కొంతమందికి ‘మా’ సభ్యత్వం లేదు. వాళ్లు తీసుకోవడం లేదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? తెలుగు సినిమాలు కావాలి గానీ.. ‘మా’లో సభ్యత్వం అక్కర్లేద్దా? ‘మా’ నిర్వహించే ఎలాంటి కార్యక్రమాల్లోనూ హీరోయిన్లు పాలు పంచుకోవడం లేదు. ఎన్నికల్లో ఓటు వేయడానికి కూడా కనిపించడం లేదు. ఇలాంటి వాళ్లు తెలుగు సినిమాల్లో నటించకుండా… ‘మా’ కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ మాటకొస్తే.. అర్చన, స్వాతి, అంజలి కూడా ‘మా’ సభ్యులే. కానీ.. ‘మా’ కార్యక్రమాల్లో వీళ్లూ కనిపించరు. టాలెంట్‌ని ఎంత తొక్కినా… అది బుసలు కొడుతూ బయటకు వస్తుంది. దాన్ని ఎవ్వరూ కప్పిపుచ్చలేరు. టాలెంట్ లేకపోతే.. తెలుగమ్మాయి అయినా ఒకటే, బాలీవుడ్ భామ అయినా ఒక్కటే. దాంతో పాటు కాస్త అదృష్టం కూడా కలసి రావాలి. నిజంగా తెలుగు నుంచి వచ్చే కథానాయికల సంఖ్య తక్కువ. దానికి మైండ్ సెట్ కూడా ఓ కారణం. చిత్రసీమకు తమ ఇంటి నుంచి అబ్బాయిని పంపడానికి ఇష్టపడే… కుటుంబాలు.. అమ్మాయిల మాటకొచ్చేసరికి ఆలోచిస్తారు. ఆ కారణంగానే.. తెలుగు నుంచి సరైన సంఖ్యలో కథానాయికలు తయారు కావడం లేదు. తెలుగువాళ్లకు అవకాశాలు రాకపోవడానికి కారణం పూర్తిగా హీరోలమీదో.. దర్శకులమీదో, నిర్మాతల మీదో నెట్టేయడం సరికాదు.