తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ వాయిదాల మీద వాయిదా పడుతూనే ఉంది. అదిగో విస్తరణ, ఇదిగో విస్తరణ అంటూ సాగదీస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు పీసీసీ చీఫ్ నియామకంతో పాటు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని ఏఐసీసీ వర్గాలతో పాటు సీనియర్ నాయకులు కూడా చెప్పారు. పీసీసీ చీఫ్ ప్రకటన అయితే వచ్చింది కానీ కొత్త మంత్రుల కథ డైయిలీ సీరియల్ లాగా కొనసాగుతూనే ఉంది.
తెలంగాణలో సీఎంతో కలిపి 18మంది క్యాబినెట్ ఉండేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం 12మంది మాత్రమే ఉండగా, మరో ఆరుగురు మంత్రులకు అవకాశం ఉంది. దీంతో ఆశావాహులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడున్న క్యాబినెట్ లో ఉమ్మడి జిల్లాల వారీగా చూసినా, అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు.
సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా రాబోయే మంత్రుల్లో తన వర్గం వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడున్న మంత్రుల్లో చాలా మంది సీనియర్లు ప్రతిపక్షాన్ని తిప్పికొట్టి, సీఎంను… ప్రభుత్వాన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయటం లేదన్నది ఓపెన్ సీక్రెట్. దీంతో కొత్తగా రాబోయే వారైనా సరే… తనకు అండగా ఉండే వారు కావాలన్నది ఆయన పట్టు.
కానీ, ఉత్తమ్ సహ సీనియర్లంతా రకరకాల పేర్లను తెరపైకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో చాలా మంది గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు సహకరించని వారే. దీంతో వారిని సీఎం రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తుండటంతో… అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతుంది.
అయితే, సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా ఎమ్మెల్సీ కోదండరాంకు ఛాన్స్ ఉండనుంది. ఆయనకు విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇవ్వబోతుండగా… ఒకరిద్దరు కొత్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా మంత్రిపదవి కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం.