ఇకపై జాతీయ రాజకీయాలపైనే ప్రత్యేక దృష్టి పెడతాననీ, తెలంగాణలో తాను చేసిన అభివృద్ధి మోడల్ దేశానికి అవసరమంటూ సీఎం కేసీఆర్ చెబుతూ వచ్చారు. ఎన్నికల ఫలితాల వచ్చిన దగ్గర్నుంచీ, రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టకుండా… ఇతర రాష్ట్రాల్లో పర్యటనలకు బయల్దేరారు. భాజపా, కాంగ్రెస్ ప్రసక్తేలేని కొత్త రాజకీయాలకు తెర తీస్తా అంటూ ఒడిశా, పశ్చిమ బెంగాల్ వెళ్లారు. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీలతో మాట్లాడారు. ఇక మిగిలింది… మాయావతి, అఖిలేష్ యాదవ్..! నేటి నుంచి మూడురోజులపాటు కేసీఆర్ ఢిల్లీలోనే గడుపుతారు. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించాక ప్రధానికి కలుస్తున్నారు. అంతకుమించిన ఆసక్తి ఆ భేటీలో ఏదీ ఉండదనే చెప్పాలి. ఎందుకంటే, ఢిల్లీకి వచ్చే ముందే నవీన్ పట్నాయక్, మమతాలను ఆయన కలిసొచ్చారు కదా!
ఇక, కేసీఆర్ తాజా టూర్ లో మిగిలింది… మాయావతి, అఖిలేష్ యాదవ్ లతో భేటీ. ఇది కూడా ఏమంత ఆసక్తికరంగా ఉండదనే అనిపిస్తోంది. ఎందుకంటే, కేసీఆర్ ప్రతిపాదనపై నవీన్ పట్నాయక్, మమతా స్పందించినట్టుగానే ఆ ఇద్దరు నేతలు కూడా మాట్లాడతారు. చూద్దాం చేద్దామని అంటారే తప్ప… చేసేస్తున్నాం అనలేరు కదా. గమనించాల్సిన విషయం ఏంటంటే… నవీన్ పట్నాయక్ మీడియా ముందుకొచ్చి కొంతైనా మాట్లాడారుగానీ, మమతా బెనర్జీ అయితే కేసీఆర్ పక్కన మౌనంగా నిలబడి ఉన్నారు. చర్చలు కొనసాగిస్తామనీ, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకొస్తామని కేసీఆర్ మాత్రమే గట్టిగా చెబుతున్నారు. మాయావతి, అఖిలేష్ ల భేటీ అనంతరం కూడా ఇదే మాట కేసీఆర్ చెప్తారు అనిపిస్తోంది.
కేసీఆర్ టూర్ కి బయలుదేరక ముందు ఏం చేస్తారా అనే ఆసక్తి ఉండేది. ఇప్పుడా టూర్ పూర్తికాకముందే.. ఇప్పట్లో ఏం జరిగేట్టు లేదులే అనే వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే, ఏ పార్టీ అయినా తమ సొంత రాజకీయ ప్రయోజనాలను అంచనా వేసుకున్నాకనే… ఇతర పార్టీలతో దోస్తీ కోసం ఆలోచిస్తుంది. కాంగ్రెస్, భాజపాలతో తెరాసకి అవసరం లేదనే నిర్ణయంతో కేసీఆర్ మూడో ఫ్రెంట్ అంటూ బయల్దేరారు. ఇదే తరహాలో ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్, బీజేడీలు కూడా తమ ప్రయోజనాలేంటి అని ముందుగా ఆలోచించుకుంటాయి కదా! ఇప్పటికిప్పుడు కేసీఆర్ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించేయాల్సిన అవసరం ఆ పార్టీలకు ఏముంది..? కేసీఆర్ అంటున్న అభివృద్ధి మోడల్ ను తమ తలకెత్తుకోవాల్సిన తొందర వారికేముంది..? ఏదేమైనా, కేసీఆర్ అంటున్న ఈ భాజపాయేతర కాంగ్రెసేతర కూటమి ప్రయత్నాలు ఎన్నికల తరువాతే తప్ప… ముందుగా కార్యరూపం దాల్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. కేసీఆర్ టూర్ పూర్తికాకముందే ఈ స్పష్టత ఆయా పార్టీల నేతల ప్రకటనల్లో కనిపిస్తోంది.