తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఆనాడు కేసీఆర్ సర్కార్ తన మాటే నెగ్గించుకుంది. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లలో అధికార పార్టీ ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోలేదు. ఫలితంగా 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాల తెలంగాణ అయ్యింది.
ఈ 33 జిల్లాల్లో… గతంలో కనీసం రెవెన్యూ డివిజన్ స్థాయి లేని ప్రాంతం కూడా జిల్లా అయ్యింది. అందుకు సిరిసిల్ల జిల్లానే నిదర్శనం. ఇదొక్కటే కాదు డివిజన్ స్థాయి కూడా లేని ప్రాంతాలు జిల్లాలయ్యాయి. రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నారన్న విమర్శలు వచ్చినా అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు.
కాంగ్రెస్ సర్కార్ రాగానే… జిల్లాల విషయంలో పునరాలోచన ఉంటుందని లీకులు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకటి రెండు సందర్బాల్లో వనపర్తిని ఉదాహరణగా చూపుతూ కామెంట్ చేయటంతో జిల్లాల సంఖ్యను కుదించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగింది. అలా ఊహాగానాలు బయటకు వచ్చాయో లేదో బీఆర్ఎస్ విమర్శలు కూడా స్టార్ట్ చేసింది.
Also Read : కేసీఆర్ ఫ్యామిలీలో కిరికిరి నడుస్తుందా..?
అయితే, జిల్లాల విషయంలో సైలెంట్ గా ఉండటమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాల పునర్విభజన అంశాన్ని ముందేసుకుంటే ఒక్క జిల్లాతో ఆగదని, పైగా ఇచ్చి వెనక్కి తీసుకుంటే స్థానిక సెంటిమెంట్ మొదలయితే మొదటికే ఇబ్బందన్న ఉద్దేశం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతుందని సమాచారం. పైగా ఒకటో తేదీకే జీతాలు ఇస్తూ, ఉద్యోగుల్లో సానుకూలత ఉన్న నేపథ్యంలో… జిల్లాలు మారిస్తే జోన్లు మార్చాల్సి వస్తుంది, ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ జాప్యం అవుతుంది…ఇవన్నీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాల పునర్విభజన అంశాన్ని పూర్తిగా పక్కనపెట్టేసినట్లుగా తెలుస్తోంది.