రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ కోసం.. ఢిల్లీకి వెళ్లి పడిగాపులు పడతారు. అలాంటి.. తెలంగాణకు వస్తే ఆయనను కలవడానికి ప్రయత్నించకుండా.. ఉండరు. తెలంగాణ లోక్‌సభ తొలి ఎన్నికల ప్రచారసభ కోసం రాహుల్ గాంధీ.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభకు.. రేవంత్ రెడ్డి డుమ్మా కొట్టారు. హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికి.. ఆయన సభకు హాజరు కాలేదు. ఈ విషయం తీవ్రంగా చర్చనీయాంశం అవుతోంది. రేవంత్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. రాహుల్ గాంధీ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రత్యేకంగా హెలికాఫ్టర్ కూడా.. ఇచ్చారు. ఇప్పుడు..లోక్ సభ ఎన్నికల విషయంలో మాత్రం రేవంత్ సైలెంటయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డిని తీవ్రంగా నిరాశపరిచాయి. తాను ఓడిపోవడాన్ని కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే.. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏమీ దూరం జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగానే పాల్గొంటున్నారు. అయితే.. మీడియాతో మాత్రం నేరుగా మాట్లాడటం లేదు. అప్పుడప్పుడు చిట్ చాట్‌గా మాట్లాడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలబడిన జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. ఆయన ఎందుకు రాహుల్ సభకు హాజరు కాలేదన్నది.. తెలంగాణ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉండాలని.. హైకమాండ్ తనను కోరాలని.. రేవంత్ అనుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. తాను టిక్కెట్ అడిగితే… కాంగ్రెస్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా రకరకాల విమర్శలు వస్తాయి. అలా కాకుండా.. నేరుగా.. హైకమాండ్‌నే తనకు టిక్కెట్ ఖరారు చేయాలని ఆయన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో.. కాంగ్రెస్ పార్టీ పాత్ర ఈ సారి ప్రముఖంగా ఉండే అవకాశాలున్న నేపధ్యంలో.. లోక్‌సభకు వెళ్లాలని ఏ కాంగ్రెస్ నాయకుడైనా అనుకుంటారు. అందుకే… మహబూబ్‌నగర్‌తో పాటు మల్కాజిగిరి, ఖమ్మం నియోజకవర్గాలు కూడా.. రేవంత్ దృష్టిలో ఉన్నాయి. కానీ ఆయన మాత్రం ప్రయత్నం చేయడం లేదు. రాహుల్ సభకు హాజరు కాకపోవడం ద్వారా.. తన ఉద్దేశాన్ని హైకమాండ్‌కు పంపాలని రేవంత్ అనుకుంటున్నారని… రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.