తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి ఓ రకంగా బంపర్ ఆఫర్ దొరికిందనే చెప్పాలి. అది ఇచ్చింది కూడా సాక్షత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం విశేషం..! ఇంతకీ ఈ ఆఫర్ ఏంటబ్బా అనుకుంటున్నారా… సస్పెన్షన్! అసెంబ్లీ నుంచి రేవంత్ రెడ్డిని అధికార పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. గవర్నర్ ప్రసంగంపై రచ్చ జరిగిన కొద్దిసేపటి తరువాత… అసెంబ్లీ నుంచి ఈ సెషన్స్ పూర్తయ్యే వరకూ రేవంత్‌ను బహిష్కరించాలంటూ మంత్రి హరీష్‌రావు ప్రతిపాదించారు. వెంటనే స్పీకర్ కూడా దీన్ని ఆమోదించి బహిష్కరించేశారు. అయితే, ఈ బహిష్కరణ బంపర్ ఆఫర్ ఎలా అవుతుందీ అనేగా మీ సందేహం..? ఆ పాయింట్‌కే వద్దాం.
గవర్నర్ ప్రసంగంలో అధికార పార్టీ సాధించిన విజయాల ఏకరవు మాత్రమే ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. ఆ ప్రసంగం ముగిసిన వెంటనే విపక్షాలన్నీ గొడవ చేయడం, ఆయన ప్రసంగంలో పేర్కొన్న విజయాలేవీ ప్రభుత్వాలు సాధించలేదని గోల చేయడం కూడా రొటీన్ ప్రాసెస్ అయిపోయింది. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో కాస్త పట్టుదలకు పోయినట్టుగా ఉన్నారు. గవర్నర్ ప్రసంగంలో ఉన్న అంశాల్లో ఒక్కటైనా తప్పు అని నిరూపిస్తే… తాను రాజీనామాకు సిద్ధం అని సవాలు విసిరారు. ఇచ్చిన ప్రతీ హామీకీ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, అమలు చేయని పక్షంలో తాను రిజైన్ చేసేందుకు సిద్ధమని కేసీఆర్ అన్నారు.
రేవంత్‌కు దొరికిన అవకాశం ఇదే..! కేసీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించడం అనేది రేవంత్ రెడ్డి రాజకీయ లక్ష్యం కదా! ఎప్పటికప్పుడు అదే విషయం చెబుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఎలాగూ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది కేసీఆరే..! గవర్నర్ ప్రసంగంలోని ఒక్క అంశమైనా తప్పుడుది అని నిరూపిస్తే రాజీనామా చేస్తా అని కేసీఆర్ అంటున్నారు. నిజానికి, తెరాసకు రాజీనామాలు అనేది కొత్త అంశం కాదు. ఉద్యమ సమయంలో ‘రాజీనామాలు’ అంటే కేరాఫ్ కేసీఆర్ అన్నట్టుగా ఉండేది. ఆ రకంగా ఇలాంటి మాటపై కేసీఆర్ నిలబడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.
ఎలాగూ రేవంత్ ఇప్పుడు సస్పెన్షన్‌లో ఉన్నారు. సభకి వెళ్లాల్సిన పనిలేదు. అంటే, అనుకోకుండా మాంచి సమయం చిక్కినట్టే కదా! గవర్నర్ ప్రసంగంలో ఏదో ఒక్క హామీ అబద్ధం అని నిరూపించేందుకు రేవంత్ ప్రయత్నించే అవకాశం ఉందనేది విశ్లేషకుల అంచనా. అయితే, ఈ క్రమంలో ఏమాత్రం బక్కబోర్లా పడ్డా మళ్లీ దాన్నుంచి కోలుకోవడం అనేది అంత ఈజీగా సాధ్యమయ్యే పని కాదు..! ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా రేవంత్ మార్చుకుంటే… తన చిరాకల స్వప్నమైన సీఎం అభ్యర్థిత్వాన్ని కూడా మరింత పదిలం చేసుకునే ఛాన్స్ ఉన్నట్టే..! ఇక, ఆయన ఆలోచనా ఓలఆచరణా ఎలా ఉంటుందో చూడాలి.