మాజీ మంత్రి మల్లారెడ్డి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబట్టారా? రాష్ట్రంలో భూకబ్జాలు, అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలు ఎందరో ఉండగా.. వరుసగా ఆయన అక్రమాస్తులపైనే దాడులు ఎందుకు చేయిస్తున్నారు? రేవంత్ తో రాజీ కుదర్చాలని కాంగ్రెస్ పెద్దల కాళ్ళావేళ్ళా పడ్డా మల్లారెడ్డిని ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదు? తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ బుర్ర బద్దలు కొడుతున్న ఈ ప్రశ్నలకు జవాబులు ఎంతకీ అంతు పట్టడం లేదు.. అయితే మల్లారెడ్డి గతంలో చేసిన ఒక పెద్ద తప్పే ఎందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఇటీవల కాలంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిలకు సంబంధించి భూవివాదాలపై తీవ్ర దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో మల్లారెడ్డిపై వరుసగా భూకబ్జా ఆరోపణలు వచ్చినా పట్టించుకోని అధికారులు.. ప్రభుత్వం మారాక ఆక్రమణలను గుర్తించి కూల్చివేతలు షురూ చేయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అధికార దర్పంతో రేవంత్ రెడ్డిని గతంలో మల్లారెడ్డి పరుష పదజాలంతో దూషించడం…తొడకొట్టి సవాల్ చేయడం వంటి చేష్టలు మనసులో బలంగా నాటుకుపోవడం వల్ల ముఖ్యమంత్రి అయ్యాక మల్లారెడ్డిపై రేవంత్ నజర్ పెట్టారేమో అనే ప్రచారం జరుగుతోంది.
నిజానికి భూ వివాదానికి సంబంధించి సీఎం వద్దే తేల్చుకుంటానని ఇటీవల రేవంత్ అపాయింట్ మెంట్ కోరిన మల్లారెడ్డి బుధవారం ఆయనను కలువనున్నట్లు తెలిపారు. కానీ, ఆయనకు రేవంత్ అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ వివాదాల సుడిగుండం నుంచి మరి మల్లారెడ్డి ఎలా బయటపడతారో చూడాలి.