తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి పీసీసీ చీఫ్ పదవి అంశం తెరపైకి వచ్చింది. రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేశారని.. రేపోమాపో ప్రకటించబోతున్నారని అంటున్నారు. అందుకే ఆయనపై మళ్లీ ఇటీవలి కాలంలో ఓటుకు నోటు కేసులో చార్జిషీట్లు.. ఇతర ప్రచారాలు జరుగుతున్నాయని అంటున్నారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ప్రకటించబోతున్నారని …ప్రచారం జరుగుతున్న సమయంలో.. ఆయనపై కేసులు వెలుగులోకి రావడం.. ఏదో ఓ కేసులో అరెస్ట్ చేయడం రివాజుగా మారింది. ఈ క్రమంలో ఈడీ.. ఓటుకు నోటు కేసులో చార్జిషీటు వేయడం వెనుక కూడా.. అదే కారణం ఉందని రేవంత్ రెడ్డి వర్గీయులు అనుమానిస్తున్నాయి.
రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ కానివ్వకుండా.. కాంగ్రెస్ పార్టీతో పాటు… ఇతర పార్టీల నుంచి కూడా చాలా మంది ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా… రేవంత్ పీసీసీ చీఫ్ కాకూడదని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడిగా..రేవంత్‌ను టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. వీరికి టీ కాంగ్రెస్‌లోని కొంత మంది నేతలు అంతర్గతంగా సహకరిస్తున్నారు. ఓ వైపు కేసులు వెలుగులోకి రావడం.. మరో వైపు వారంతా.. హైకమాండ్ వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేయడం… రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే తామంతా పార్టీ వదిలి వెళ్లిపోతామని హెచ్చరించడం లాంటివి చేస్తున్నారు. దాంతో.. కాంగ్రెస్ హైకమాండ్‌కు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని సందిగ్ధత ఏర్పడుతోంది.
ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైన దశకు చేరింది. ఇప్పుడు కూడా నిర్ణయం తీసుకుని … యువతరానికి పగ్గాలు ఇవ్వకపోతే.. ఇక పార్టీ కోలుకోదనే అంచనాలో ఉన్నారు. రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే.. ఉండేవాళ్లు ఉంటారు.. లేని వాళ్లు పోతారు.. గోడమీద పిల్లి వాటం లాంటి నేతలతో ప్రయోజనమేమిటన్న చర్చ చాలా మందిలో నడుస్తోంది. ఏఐసీసీ కూడా ఇప్పటికే… వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుందని.. రేపోమాపో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ప్రకటిస్తుదంని కాంగ్రెస్ క్యాడర్లో నమ్మకం పెరుగుతోంది.కానీ ఎంత కాలం నాన్చితే అంత నష్టం జరుగుతుందని అంటున్నారు.