ఎవరెన్ని చెప్పుకున్నా, ఆయన ఎన్ని ఫ్లాపులు కొన్ని తెచ్చుకున్నా – వర్మ అనేది ఓ బ్రాండ్. వర్మ ఏం చెప్పినా, వినడానికి సిద్ధంగా ఉంటారంతా! ఆయన మాటల్లో చేతల్లో ఓ మ్యాజిక్ ఉంది. దానికి ఎవరైనా సరే – దాసోహం అనాల్సిందే. తెలుగు సినిమాకి సరికొత్త టెక్నిక్ పరిచయం చేశాడు వర్మ. ఇప్పటికీ వర్మ ఓ గ్రేట్ టెక్నీషియనే. అయితే తన సినిమాల వరకూ ఆ మ్యాజిక్ చూపించలేకపోతున్నాడు. నాగార్జునతో పాతికేళ్ల తరవాత `ఆఫీసర్` అనే సినిమా చేస్తున్నా- దానికి ఎలాంటి హైప్రాలేదు. దానికి కారణం వర్మ వ్యక్తిగత పరాజయాలే. ఇక మీదట వర్మకి సినిమాలొస్తాయని భరోసా లేదు. స్టార్లు అతన్ని నమ్మే అవకాశమే లేదు. అందుకే.. మరో దారి చూసుకున్నాడు. ఆర్జీవీ అన్‌స్కూల్ అంటూ.. ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కి శ్రీకారం చుట్టబోతున్నాడు. సాధారణంగా ఓ అగ్ర దర్శకుడు, పరిశ్రమలో అపారమైన అనుభవం ఉన్న వర్మ లాంటి వాడు.. ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పెడితే `సినీ కళామతల్లి రుణం తీర్చుకోవడానికి` అంటూ పెద్ద పెద్ద పదాలు వాడేస్తారు. కానీ వర్మ `ఇది పూర్తిగా వ్యాపార దృక్పథంతో చేస్తున్నా` అంటూ కుండబద్దలు కొట్టేశాడు. `ఛారిటీ కోసం స్కూలు స్థాపించడం లేదు. పేదవాళ్లు ఇటువైపు చూడొద్దు. ఎలాంటి కన్సెషనూ ఆశించొద్దు` అంటూ గట్గిగానే చెప్పాడు. వర్మ స్కూలు పెడుతున్నాడంటే – యువతరం అటువైపు కచ్చితంగా దృష్టి పెడుతుంది. దానికి తగట్టు భారీగా ఫీజులు వసూలు చేసే పనిలో పడ్డాడు వర్మ. తన బ్రాండ్‌ని ఇప్పుడు ఇలా అమ్ముకోవడం మొదలెట్టాడన్నమాట. దర్శకుడిగా తన దారులు మూసుకుపోతున్న తరుణంలో.. ఆదాయ మార్గం కోసం వర్మ ఎంచుకున్న నయా దారి ఇది.. అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వర్మ నుంచి చాలామంది శిష్యులు సినీ పరిశ్రమకు వచ్చారు. వర్మ కంటే మిన్నగా సినిమాలు తీసి భేష్ అనిపించుకున్నారు. అలాంటి దర్శకుల్ని ఈ స్కూలు అందించగలిగితే… వర్మ ఏ ఉద్దేశ్యంతో మొదలెట్టినా పరిశ్రమకు ఎంతోకొంత మేలు జరిగినట్టే.