ట్రైలర్ ని పాతిక రూపాయలకు అమ్మేసి – కేవలం ట్రైలర్‌తోనే సినిమా బడ్జెట్ ని వెనక్కి లాగేయాలన్న మహత్తరమైన వర్మ ఐడియా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ట్రైలర్ ముందే లీకైపోయింది. ఇక గత్యంతరం లేక.. ట్రైలర్‌ని ఉచితంగా విడుదల చేయాల్సివచ్చింది. ట్రైలర్ కోసం డబ్బులు కట్టిన వాళ్లందరికీ తిరిగి డబ్బులు చెల్లించేశాడు వర్మ.
ఈ ట్రైలర్ లీకైందా? లీక్ చేశారా? అనే కొత్త ప్రశ్న ఉదయించింది. వర్మ కావాలనే ట్రైలర్ లీక్ చేశాడని, అది బహిరంగ రహస్యమని అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే… వర్మ ట్రైలర్ లీక్ చేయాల్సిన పరిస్థితుల్ని కల్పించింది ప్రత్యర్థి వర్గం. దాని వెనుక పెద్ద ప్లానే వేశారంతా.
ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనేవెబ్ సైట్లో ట్రైలర్‌ని ఉంచాడు వర్మ. అందులోకివెళ్లి.. టికెట్ బుక్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన సర్వర్ నైజీరియాలో ఉందట. ఆ సర్వర్‌ని కొంతమంది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. `నా ట్రైలర్చూడ్డానికి 20 వేల మంది టికెట్లు కొన్నారు` అని వర్మ చెప్పడం మొదలెట్టాడు. ట్రైలర్ విడుదలైన రోజు.. లక్షల మంది చూశారు అని బుకాయించగలడు కూడా. నిజానికి ముందస్తుగా బుక్ అయిన టికెట్లు వెయ్యి కూదా దాటలేదట. ఆ వివరాల్ని స్క్రీన్ షాట్స్ తీసి వర్మకి పంపార్ట. సర్వర్‌ని హ్యాక్ చేయడంతో ట్రైలర్‌ని ఎంత మంది చూశారో జనాలకు ఈజీగా తెలిసిపోయే ఛాన్సుంది. పైగా లక్షల్లో చూడాల్సిన ట్రైలర్ వందలకు, వేలకు పరిమితం అవుతుంది. అది తన సినిమాకి మంచిది కాదు. అందుకే.. వర్మ కావాలనే ట్రైలర్ లీక్ చేశాడంటున్నారు. మరి ఈ హ్యాకింగ్ విషయాన్ని వర్మ పోలీసుల వరకూ తీసుకెళ్తాడా? లేదంటే లీక్ చేసింది తనే కాబట్టి ఊరుకుంటాడా? ఏమో… వర్మ ఏమైనా చేస్తాడు. తన సినిమాకి పావలా ప్రచారం వస్తుందంటే ఎంతకైనా తెగిస్తాడు. మరి ఈసారి వర్మ ఏం చేస్తాడో చూడాలి.