భారత జట్టు ఈ ప్రపంచానికి అందించిన అద్భుతమైన బ్యాటర్లలో రోహిత్ శర్మ ఒకడు. దూకుడైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకొన్నాడు. ఎన్నోసార్లు జట్టుని ఒంటి చేత్తో గెలిపించాడు. రోహిత్ శర్మ అంటేనే వన్డేల్లో అతను సాధించిన మూడు డబుల్ సెంచరీలు గుర్తొస్తాయి. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా తన రికార్డు పదిలంగా ఉంది. అయితే రోహిత్ శర్మ ఫామ్ ప్రస్తుతం భయంకరంగా ఉంది. ఆసీస్ గడ్డమీద వరుసగా విఫలం అవుతున్నాడు. కీలకమైన నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో మూడు పరుగులకే ఔటై ప్రత్యర్థులకు తనే అస్త్రాల్ని ఉచితంగా అందించాడు. ఓవైపు బ్యాటర్ గా ఫ్లాప్, మరోవైపు కెప్టెన్సీ వీక్.. ఇంకో వైపు ఫీల్డర్ గా కూడా చురుగ్గా కదల్లేకపోతున్నాడు. కొన్ని సులభమైన క్యాచ్‌లను సైతం జార వేస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే.. తోటి ఆటగాళ్లతో తనకు సయోధ్య కుదరడం లేదన్న మాట వినిపిస్తోంది. ఇవన్నీ పరిగణలోనికి తీసుకొంటే – అతి త్వరలోనే రోహిత్ గుడ్ బై చెప్పేస్తాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సిడ్నీ టెస్ట్ మ్యాచ్ తరవాత రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ తో పాటు, ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెబుతాడన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో విఫలమైనా, సిడ్నీ టెస్ట్ లోనూ ఇదే పేలవమైన ఫామ్ కొనసాగించినా, రోహిత్ తీవ్రస్థాయిలో విమర్శలకు గురి కావడం ఖాయం. అందుకే 5వ టెస్ట్ మొదలు కాకముందే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. టెస్ట్ క్రికెట్ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. బజ్ బాల్ గేమ్ తో మ్యాచ్ ఫలితాల్ని తారు మారు చేస్తున్నారు. మైదానం లోపల, బయటా దూకుడుగా ఉండాల్సిందే. యువరక్తం జట్టులో స్థానం సంపాదించడానికి ఉరకలేస్తోంది. గిల్, జైస్వాల్ లాంటి ప్రతిభావంతులు ఓపెనర్లుగా రాణిస్తున్నారు. అలాంటప్పుడు రోహిత్ ఇంకా జట్టులో కొనసాగడంలో అర్థం లేదన్నది మాజీల వాదన.
రోహిత్ రిటైర్ అయిపోతే కెప్టెన్ ఎవరు? అనే చర్చ కూడా అనవసరం. ఎందుకంటే బుమ్రా ఆ బాధ్యతల్ని చక్కగా నెరవేరుస్తున్నాడు. రోహిత్ గైర్హాజరీలో టెస్ట్ మ్యాచ్ కి సారధిగా వ్యవహరించిన అనుభవం ఉంది. కాబట్టి.. రోహిత్ రిటైర్ అయిపోవడానికి ఇదే సరైన సమయం కూడా. మరి హిట్ మాన్ మనసులో ఏముందో?