నాని – అంటే సుందరానికీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించి పాజిటీవ్ గా మాట్లాడుకోవడానికి చాలా అంశాలున్నాయి. నెగిటీవ్ అంటే.. ముందుగా గుర్తొచ్చేది నిడివి మాత్రమే. దాదాపు 3 గంటల సినిమా ఇది. ఈ రోజుల్లో 3 గంటలంటే.. సుదీర్ఘ ప్రయాణమే అని చెప్పాలి. ఎంత పెద్ద స్టార్లున్నా, వాళ్లెంత అద్భుతంగా చేసేస్తున్నా, ప్రతీ సీనులోనూ కంటెంట్ నింపేసినా 3 గంటలు చూడడం చాలా కష్టం. విడుదలకు ముందు కూడా చిత్రబృందంలో నిడివి గురించిన డిస్కర్షన్ బాగా నచ్చింది. సినిమా నిడివి పెరిగిందని, కాస్తో కూస్తో కత్తిరించాలని కొందరు, అలా కత్తిరిస్తే ఎమోషన్ మిస్సయిపోతుందని కొందరు వాదించుకొన్నారు. చివరికి కత్తెర వేయకూడదనే నిర్ణయం తీసుకొన్నారు. అలా మూడు గంటల సినిమా… విడుదల చేసేశారు.
ఇప్పుడు అందరినోటా ఒకటే మాట. అదే.. రన్ టైమ్ పెరిగిందని. `సినిమా అంతా బాగానే ఉంది.. కాస్త కట్ చేస్తే ఇంకాస్త స్పీడుగా ఉండేది..` అని చెబుతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ఇప్పుడు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం 20 నిమిషాల రన్ టైమ్ తగ్గిస్తే బాగుంటుందని ఇప్పుడు ఆలోచనలో పడినట్టు టాక్. ఎక్కడెక్కడ కత్తెర్లు వేయాలి? అనే విషయంపై దర్శక నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నాని కూడా `తగ్గిస్తే బెటర్` అనే సలహా ఇచ్చాడట. ఈరోజు ఈ విషయంపై దర్శక నిర్మాతలు ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.