సీఎం జగన్‌పై ఉన్న కేసులను సీక్రెట్‌గా ఎత్తేసుకున్న వైనంపై హైకోర్టు సుమోటోగా విచారణ చేయడాన్ని కుట్రగా ప్రచారం చేసేందుకు ఏపీ అధికార పార్టీ ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. హైకోర్టులో అడ్వేకేట్ జనరల్ అదే స్థాయిలో వాదనలు వినిపించి.. వాటిని అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం కల్పించిన .. అధికార పార్టీ నేతలు ఇప్పుడు నేరుగా.. వ్యవస్థల మేనేజ్మెంట్ గురించి మాట్లాడటం ప్రారంభించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చి… జగన్ ప్రభుత్వం పై కుట్ర చేస్తున్నారని పాత వాదనను కొత్తగా వినిపించేందుకు ప్రయత్నించారు.
వ్యవస్థలను అడ్డుపెట్టుకొని ఎలా వేధించాలో చంద్రబాబుకు తెలుసని .. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని చెప్పుకొచ్చారు. నేరుగా చెప్పకపోయినప్పటికీ.. కేసులు ఎత్తివేత విషయంలో హైకోర్టు సుమోటోగా విచారించడం వెనుక చంద్రబాబు ఉన్నారని పరోక్షంగా సజ్జల స్పష్టం చేసినట్లయింది. సజ్జల వ్యాఖ్యలు న్యాయవర్గాల్లో సైతం చర్చనీయాంశమవుతున్నాయి. గతంలో.. హైకోర్టులో ఇలాంటి వ్యాఖ్యలే చేసేవారు. హైకోర్టు న్యాయమూర్తుల్ని .. చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని.. వారి కాల్ లిస్ట్ పరిశీలించాలంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడ్డారు.
చివరికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరిని అనేకానేక ఫిర్యాదులు చేసి బదిలీ చేయించారన్న విమర్శలు కూడా వచ్చాయి. హైకోర్టుకు కొత్త సీజే వచ్చిన తర్వాత అయినా వైసీపీ న్యాయవ్యవస్థ మీద విశ్వాసం ఉండేలా ప్రకటనలు చేస్తుందనుకుంటే.. తమకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడల్లా… న్యాయవ్యవస్థపై సందేహాలు లెవనెత్తే ప్రయత్నంలోనే ఉన్నారు. మళ్లీ సజ్జల ఈ మేనేజ్ మెంట్ విమర్శలు ప్రారంభించడంతో.. మళ్లీ వారు పాత దారిలో ఎదురుదాడికి సిద్ధమవుతున్నారన్న చర్చ జరుగుతోంది.