తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు సాగర్ ఎడమ కాల్వ కింద రెండో పంటకు నీరు ఇచ్చే విషయంపై కలిసినట్టుగా సీఎం కార్యాలయం తెలిపింది.అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక హోరాహోరీగా కొనసాగుతున్న సమయంలో సండ్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ కావడం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల్లో గెలిచిన నాటినుండి ఆయన టిఆర్ఎస్ లో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఆయన సీఎం ను కలవడంతో మరోసారి చేరిక అంశం తెరమీదకు వస్తోంది. టిఆర్ఎస్ ఎంఐఎం కలిసి ఐదు స్థానాలు గెలవాలంటే మరో ఇద్దరి ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దీంతో సండ్ర వెంకట వీరయ్య ముఖ్యమంత్రి ని కలిసారంటే నేడో రేపో పార్టీలో చేరే అవకాశం ఉంటుందని అంటున్నారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికినే లేకుండా చేయాలని భావించిన గులాబీబాస్ కేసీఆర్ కు ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీడీపీ తరపున గెలిచిన ఇద్దర్నీ కారెక్కిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
గెలిచిన తర్వాత సండ్ర టీడీపీకి అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొదట డుమ్మా కొట్టారు. రెండురోజుల తర్వాత ప్రమాణం చేశారు. తాజాగా జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనూ ఒకేరోజు హాజరవ్వడం మినహా సండ్ర దూరంగానే ఉన్నారు. ఇక ప్రతిష్టాత్మకమైన టీటీడీ బోర్డు పదవి మళ్లీ వరించినా… ఆయన సకాలంలో ప్రమాణ స్వీకారం చేయకపోవడంతో ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పరిణామాలన్నీ సండ్ర పార్టీ మార్పుకు సంకేతమనే చర్చ రాజకీయవర్గాల్లో జోరందుకుంది. తాజాగ జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఖమ్మం జిల్లాకు ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం కల్పించలేదు. సండ్ర టీఆర్ఎస్ లోకి వస్తారని.. విస్తరణలో ఆయనకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. సండ్ర సామాజికవర్గానికి ఒక బెర్త్ తప్పనిసరిగా కల్పించాల్సి ఉంది. అది సండ్రకే ఇస్తారని చెబుతున్నారు.
ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాలకు ఆరుగురు అభ్యర్దులు పోటీ చేయడంతో… సభలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఓటు చాల కీలకంగా మారింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ , టీడీపీ కలిసి పోటీచేశాయి. దీంతో కాంగ్రెస్ కు బలం తక్కువగా ఉన్నప్పటికి… టీడీపీ ఎమ్మెల్యేలు తమకే మద్దతిస్తారన్న నమ్మకంతో ఎన్నికల బరిలోకి దిగింది. సండ్ర కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయడం లేదు.